బుమ్రాను కాదని కుల్దీప్‌ను పొగిడిన గిల్.. జట్టులో కొత్త చర్చ

  • వెస్టిండీస్‌పై టెస్ట్ సిరీస్‌ను 2-0తో క్లీన్‌స్వీప్ చేసిన భారత్
  • కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్‌కు ఇదే తొలి సిరీస్ విజయం
  • రెండో టెస్టులో అద్భుత ప్రదర్శనకు కుల్దీప్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’
  • కుల్దీప్ యాదవే తమ జట్టులో కీలక బౌలర్ అని ప్రశంసించిన గిల్
  • పిచ్‌తో సంబంధం లేకుండా కుల్దీప్ వికెట్లు తీస్తాడని కితాబు
టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా కాదు, మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవే తమ జట్టు ప్రధాన అస్త్రమని భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ వ్యాఖ్యానించాడు. వెస్టిండీస్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌ను కైవసం చేసుకున్న అనంతరం గిల్ ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పిచ్ ఎలాంటిదైనా మ్యాచ్‌ను మలుపు తిప్పే సత్తా కుల్దీప్‌కు ఉందని కొనియాడాడు.

వెస్టిండీస్‌తో రెండు టెస్టుల సిరీస్‌ను భారత్ 2-0 తేడాతో క్లీన్‌స్వీప్ చేసింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన రెండో టెస్టులో 7 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్‌కు ఇదే తొలి సిరీస్ విజయం కావడం విశేషం. ఈ సిరీస్‌లో బుమ్రా కేవలం 7 వికెట్లతో నిరాశపరచగా, కుల్దీప్ యాదవ్ 12 వికెట్లతో అగ్రస్థానంలో నిలిచాడు.

విజయం అనంతరం గిల్ మాట్లాడుతూ "కుల్దీప్ ప్రదర్శన పట్ల నేను చాలా సంతోషంగా ఉన్నాను. అతడు ఎల్లప్పుడూ మాకు వికెట్లు తీసిపెట్టే కీలక బౌలర్. ఎలాంటి పరిస్థితుల్లోనైనా, ఎలాంటి పిచ్ పైనైనా కుల్దీప్ లాంటి మణికట్టు స్పిన్నర్‌ను ఆడించాలనిపిస్తుంది" అని చెప్పాడు. అయితే, కొన్నిసార్లు అదనపు ఆల్‌రౌండర్‌ను తీసుకోవాల్సి వచ్చినప్పుడు అతడిని పక్కనపెట్టాల్సి వస్తుందని గిల్ వివరించాడు. "పిచ్‌తో సంబంధం లేకుండా మమ్మల్ని మ్యాచ్‌లో నిలిపే బౌలర్ కుల్దీప్" అని గిల్ ప్రశంసలతో ముంచెత్తాడు.

ఢిల్లీ టెస్టులో కుల్దీప్ యాదవ్ అద్భుత ప్రదర్శన చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్ల ఘనతతో సహా మ్యాచ్ మొత్తంలో 8 వికెట్లు పడగొట్టి 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డును అందుకున్నాడు. అతని ప్రదర్శన సిరీస్ విజయంలో కీలక పాత్ర పోషించింది.


More Telugu News