పాక్-ఆఫ్ఘన్ సరిహద్దులో మళ్లీ కాల్పుల మోత.. తాలిబన్ సైనిక పోస్టులపై పాక్ భీకర దాడులు

  • పాక్-ఆఫ్ఘన్ సరిహద్దులో మళ్లీ కాల్పులు
  • ఆఫ్ఘన్ సైనిక పోస్టులు, ట్యాంకులను ధ్వంసం చేసిన పాక్ సైన్యం
  • తమపై రెచ్చగొట్టేలా కాల్పులు జరిపారని పాకిస్థాన్ ఆరోపణ
  • వారం రోజులుగా ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు
పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ దేశాల మధ్య సరిహద్దు వివాదం మళ్లీ భగ్గుమంది. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని కుర్రం సెక్టార్‌లో ఈ తెల్లవారుజామున ఇరు దేశాల సైనికుల మధ్య తీవ్రస్థాయిలో కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ దాడుల్లో ఆఫ్ఘన్ సైన్యానికి చెందిన పలు ట్యాంకులు, సైనిక పోస్టులు ధ్వంసమైనట్లు పాకిస్థాన్ మీడియా వెల్లడించింది.

పాక్ భద్రతా వర్గాల సమాచారం ప్రకారం ఆఫ్ఘన్ తాలిబన్ దళాలు, తెహ్రీక్-ఇ-తాలిబన్ పాకిస్థాన్ (టీటీపీ) ఉగ్రవాదులు కలిసి తమ సైనిక పోస్టులపై ఎలాంటి రెచ్చగొట్టే చర్యలు లేకుండా కాల్పులకు తెగబడ్డారని పాకిస్థాన్ ఆరోపించింది. దీంతో పాక్ సైన్యం పూర్తిస్థాయిలో, తీవ్రంగా ప్రతిస్పందించిందని అక్కడి ప్రభుత్వ మీడియా సంస్థ పీటీవీ న్యూస్ నివేదించింది. పాక్ జరిపిన ఎదురుదాడుల్లో ఆఫ్ఘన్ సైనిక పోస్టులు తీవ్రంగా దెబ్బతిన్నాయని, ఒక ట్యాంకు మంటల్లో కాలిపోయిందని, దీంతో తాలిబన్ సైనికులు తమ స్థావరాల నుంచి పారిపోయారని పాక్ మీడియా పేర్కొంది. మరో ఆఫ్ఘన్ పోస్టును, ట్యాంకును కూడా నాశనం చేసినట్లు తరువాత వెల్లడించింది.

ఆఫ్ఘనిస్థాన్‌లోని ఖోస్త్ ప్రావిన్స్ డిప్యూటీ పోలీస్ ప్రతినిధి తాహిర్ అహ్రర్ ఈ ఘర్షణలను ధ్రువీకరించినప్పటికీ, పూర్తి వివరాలు వెల్లడించలేదు. ఈ వారంలో ఇరు దేశాల మధ్య కాల్పులు జరగడం ఇది రెండోసారి. గత శనివారం నుంచి ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరాయి. ఆ ఘర్షణల్లో తమ సైనికులు 23 మంది మరణించారని, ప్రతిగా 200 మందికి పైగా తాలిబన్, అనుబంధ ఉగ్రవాదులను హతమార్చామని పాకిస్థాన్ ప్రకటించింది.

అయితే, తమ భూభాగంపై పాక్ దాడులకు ప్రతీకారంగా 58 మంది పాక్ సైనికులను చంపినట్లు కాబూల్ తెలిపింది. సౌదీ అరేబియా, ఖతార్ దేశాలు జోక్యం చేసుకున్నప్పటికీ ఉద్రిక్తతలు చల్లారలేదు. దీంతో ఇరు దేశాల మధ్య అన్ని సరిహద్దు క్రాసింగ్‌లను ఇప్పటికే మూసివేశారు. తమ దేశంలో దాడులకు పాల్పడుతున్న టీటీపీకి ఆఫ్ఘనిస్థాన్ ఆశ్రయం కల్పిస్తోందని పాకిస్థాన్ ఎప్పటినుంచో ఆరోపిస్తోంది. అయితే ఈ ఆరోపణలను కాబూల్ ఖండిస్తూ వస్తోంది.


More Telugu News