ఇలాంటి మేనేజర్ ను ఏంచేయాలంటారో మీరే చెప్పండి.. రెడ్డిట్ లో ఓ ఉద్యోగి పోస్ట్

  • అనారోగ్యంతో బాధపడుతున్నానని మెసేజ్ చేసినా లీవ్ ఇవ్వడంలేదన్న ఉద్యోగి 
  • మెడికల్ ప్రిస్క్రిప్షన్ పంపించినా జీతంలో కోత పెడతానని బెదిరిస్తున్నాడని ఆవేదన
  • సోషల్ మీడియాలో వైరల్ గా మారిన పోస్ట్
కార్పొరేట్ కంపెనీల్లో ఉద్యోగుల పట్ల మానవత్వమనేదే చూపడం లేదని తాజాగా మరో సంఘటన చాటిచెప్పింది. అనారోగ్యంతో బాధపడుతున్న ఓ ఉద్యోగి లీవ్ అడిగితే.. సానుభూతితో వ్యవహరించాల్సిన మేనేజర్ ‘క్రమశిక్షణ’పై పాఠాలు చెప్పడం, లాస్ ఆఫ్ పే తప్పదని బెదిరించిన ఘటనకు సంబంధించిన వాట్సాప్ స్క్రీన్ షాట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ స్క్రీన్ షాట్లను రెడ్డిట్ లో పోస్టు చేస్తూ.. ‘ఇలాంటి మేనేజర్ ను ఏం చేయమంటారు’ అంటూ బాధిత ఉద్యోగి వాపోయాడు. రెండు రోజులుగా తాను అనారోగ్యంతో బాధపడుతున్నానని సదరు ఉద్యోగి చెప్పుకొచ్చాడు.

‘‘ఎక్కువ సేపు నిల్చోలేకపోతున్నా.. కూర్చోలేకపోతున్నా. ఇదే విషయం నా మేనేజర్ కు వాట్సాప్ లో మెసేజ్ చేసి లీవ్ అడిగాను. డాక్టర్ రాసిచ్చిన ప్రిస్క్రిప్షన్ ను ఫొటో తీసి పంపించా. అయినా ఆయన నాకు లీవ్ ఇవ్వడానికి నిరాకరించడమే కాకుండా.. నీకు క్రమశిక్షణ నేర్పిందెవరంటూ ఎదురు ప్రశ్నించాడు. బాధ్యతల నుంచి పారిపోతున్నావంటూ నన్ను నిందించాడు. కోలుకున్నాక ఆఫీసుకు వచ్చి నా బాధ్యతలన్నీ పూర్తిచేస్తానని చెప్పినా వినిపించుకోకుండా జీతంలో కోత పెడతానని బెదిరిస్తున్నాడు. అయినా అనారోగ్యంతో ఆసుపత్రి బెడ్ పై ఉన్న వ్యక్తి తన ఆరోగ్యం గురించి ఆలోచించాలా.. లేక ఆఫీసులో పని గురించి ఆలోచించాలా?’’ అని ఉద్యోగి తన పోస్టులో ప్రశ్నించాడు.

ఈ పోస్టు చదివిన నెటిజన్లు సదరు మేనేజర్ పై తీవ్రంగా మండిపడుతూ కామెంట్లు పెడుతున్నారు. తన కింద పనిచేసే ఉద్యోగుల పట్ల కనీస మానవత్వం కూడా చూపడంలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోలుకున్నాక ఆ ఆఫీసును వదిలేసి మరో ఉద్యోగం వెతుక్కోమంటూ సలహా ఇస్తున్నారు.


More Telugu News