ఇన్‌స్టాగ్రామ్‌లో టీనేజ్ యూజర్లకు అందుబాటులో ఉండే కంటెంట్‌పై పరిమితులు

  • టీనేజర్ల భద్రతకు సినిమా స్థాయిలో పరిమితులు
  • పీజీ - 13 రేటింగ్ మార్గదర్శకాల ఆధారంగా 
  • 18 ఏళ్లలోపు ఉన్న యూజర్లను ఆటోమేటిక్‌గా 13 ప్లస్ సెట్టింగ్‌లో
మెటాకు చెందిన ప్రముఖ సోషల్ మీడియా వేదిక ఇన్‌స్టాగ్రామ్ టీనేజ్ యూజర్ల భద్రతను మరింత బలోపేతం చేసేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. సినిమాలు, టీవీ షోలలో అమలులో ఉన్న పీజీ-13 రేటింగ్ మార్గదర్శకాల ఆధారంగా, టీనేజ్ యూజర్లు చూడగల కంటెంట్స్‌పై కొత్త పరిమితులు విధించనున్నట్లు సంస్థ ప్రకటించింది.

ఇన్‌స్టాగ్రామ్ తాజా ప్రకటనలో తెలిపిన వివరాల ప్రకారం.. 18 ఏళ్లలోపు ఉన్న యూజర్లను ఆటోమేటిక్‌గా 13 ప్లస్ సెట్టింగ్‌లో ఉంచనున్నారు. ఈ సెట్టింగ్‌ను టీనేజ్ యూజర్లు తల్లిదండ్రుల అనుమతి లేకుండా మార్చుకోలేరని స్పష్టం చేసింది.

ఈ కొత్త వ్యవస్థలో భాగంగా, హింసాత్మక సన్నివేశాలు, అశ్లీల లేదా అసభ్య కంటెంట్, డ్రగ్స్ వాడకం, అసభ్య పదజాలం వంటి అంశాలున్న పోస్టులు, వీడియోలు, రీల్స్ టీనేజ్ యూజర్లకు అందుబాటులో ఉండవని కంపెనీ వెల్లడించింది.

తప్పుడు వయసు వివరాలతో పెద్దవారిలా నటించే యూజర్లను గుర్తించడానికి ఇన్ స్టా కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత “వయసు అంచనా టెక్నాలజీ”ని వినియోగిస్తోంది. ఈ సాంకేతికత ద్వారా యూజర్ల ప్రవర్తన, చలనం, ఫోటో వివరాల ఆధారంగా వారి వయసును అంచనా వేయనుంది.

మెటా తెలిపినట్లు, ఇది గత ఏడాది నుండి టీన్ అకౌంట్ల భద్రత కోసం తీసుకొస్తున్న చర్యల్లో అత్యంత ముఖ్యమైన అప్‌డేట్. ఇప్పటి వరకు ఉన్న ఆటోమేటిక్ ప్రొటెక్షన్లను మరింత బలోపేతం చేస్తూ, కొత్త ఫిల్టరింగ్ వ్యవస్థను ప్రవేశపెట్టనున్నారు.

“అన్ని నియంత్రణలున్నప్పటికీ కొన్ని సందర్భాల్లో అనుచిత కంటెంట్ కనిపించే అవకాశం ఉంది. దీన్ని పూర్తిగా నివారించేందుకు మా ఆల్గారిథమ్స్‌ను త్వరగా అభివృద్ధి చేస్తున్నాం” అని కంపెనీ ప్రతినిధులు తెలిపారు.

ఇన్ స్టా ఈ చర్యల ద్వారా టీనేజ్ యూజర్లకు సురక్షితమైన, వయసుకు తగిన అనుభవాన్ని అందించడంతో పాటు తల్లిదండ్రులకు మరింత నియంత్రణ ఇచ్చే దిశగా ముందడుగు వేసిందని మెటా పేర్కొంది. 


More Telugu News