కన్నప్రేమకు ఇదేనా వెల?.. వృద్ధ తండ్రిని వదిలించుకున్న కొడుకులు

  • విశాఖలో వెలుగు చూసిన అమానవీయ ఘటన
  • కన్నతండ్రిని గొయ్యిలో పడేసిన ముగ్గురు కుమారులు
  • సినిమా షూటింగ్ చూపిస్తామని తీసుకొచ్చిన వైనం
  • స్థానికుల సమాచారంతో కాపాడిన రెడ్‌క్రాస్ సిబ్బంది
  • అనకాపల్లి జిల్లాకు చెందిన బాధితుడు భాస్కరరావు
  • రెడ్‌క్రాస్ షెల్టర్‌లో వృద్ధుడికి ఆశ్రయం
కన్నప్రేమకు మాయని మచ్చ తెచ్చే అమానవీయ ఘటన విశాఖపట్నంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వృద్ధాప్యంలో ఉన్న తండ్రిని వదిలించుకోవాలని చూసిన కొడుకులు, 'సినిమా షూటింగ్ చూపిస్తాం' అని నమ్మించి నగరానికి తీసుకొచ్చి, రోడ్డు పక్కన ఓ గొయ్యిలో పడేసి వెళ్లిపోయారు. స్థానికులు గమనించి సమాచారం ఇవ్వడంతో రెడ్‌క్రాస్ సిబ్బంది ఆ వృద్ధుడికి ఆశ్రయం కల్పించారు.

వివరాల్లోకి వెళితే, అనకాపల్లి జిల్లా మునగపాకకు చెందిన నందమూడు భాస్కరరావు (70)కు ముగ్గురు కుమారులున్నారు. దసరా పండుగ సమయంలో ఆయన కుమారులు తండ్రిని సినిమా షూటింగ్ చూపిస్తామంటూ విశాఖ నగరానికి తీసుకొచ్చారు. అనంతరం అగనంపూడి సమీపంలోని శనివాడ-స్టీల్‌ప్లాంటు రహదారి పక్కన నిర్మానుష్య ప్రాంతంలో ఉన్న ఓ పెద్ద గొయ్యిలోకి తోసేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు.

కొన్ని గంటల పాటు ఆహారం లేక, నిస్సహాయ స్థితిలో గొయ్యిలోనే ఉండిపోయిన భాస్కరరావును కొందరు స్థానికులు గమనించారు. వెంటనే ఆయన్ను బయటకు తీసి, ఆకలి తీర్చడానికి ఆహారం అందించారు. ఈ విషయాన్ని సింధు ప్రియ అనే మహిళ పెదవాల్తేరులోని రెడ్‌క్రాస్ సంస్థకు తెలియజేశారు.

సమాచారం అందుకున్న రెడ్‌క్రాస్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. వృద్ధుడి ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి, అనంతరం తమ షెల్టర్‌లెస్ హోమ్‌కు తరలించారు. ప్రస్తుతం భాస్కరరావు వారి సంరక్షణలో ఉన్నారు. కనిపెంచిన తండ్రి పట్ల కన్నకొడుకులే ఇంత కర్కశంగా ప్రవర్తించడం పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


More Telugu News