తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు: ఐక్లౌడ్ పాస్‌వర్డ్ ఇవ్వాల్సిందే.. ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టు ఆదేశం

  • పాస్‌వర్డ్ మర్చిపోయాను అంటే కుదరదు.. ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టు స్పష్టం
  • సిట్ పిలిచినప్పుడు ఫోరెన్సిక్ నిపుణుల సమక్షంలో పాస్‌వర్డ్ రీసెట్ చేయాలని సూచన
  • ప్రభాకర్ రావు దర్యాప్తునకు సహకరించడం లేదని కోర్టుకు తెలిపిన తెలంగాణ ప్రభుత్వం
  • తదుపరి విచారణ వరకు ప్రభాకర్ రావు అరెస్ట్ నుంచి మధ్యంతర రక్షణ కొనసాగింపు
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ టి. ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆయన తన ఐక్లౌడ్ సహా ఇతర క్లౌడ్ ఖాతాల ఐడీ, పాస్‌వర్డ్‌లను ప్రత్యేక దర్యాప్తు బృందానికి (సిట్) తప్పనిసరిగా అందించాలని మంగళవారం స్పష్టం చేసింది. ఈ కేసులో ఆయన అరెస్ట్‌పై మధ్యంతర రక్షణను పొడిగిస్తూనే, దర్యాప్తునకు పూర్తిగా సహకరించాలని ఆదేశించింది.

తాను తన ఐక్లౌడ్ ఖాతా పాస్‌వర్డ్‌ను మర్చిపోయానని, అది చాలా పాతదని ప్రభాకర్ రావు తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీనిపై స్పందించిన జస్టిస్ బి.వి. నాగరత్న, జస్టిస్ ఆర్. మహాదేవన్‌లతో కూడిన ధర్మాసనం, సిట్ ఎప్పుడు పిలిచినా ఫోరెన్సిక్ నిపుణుల సమక్షంలో పాస్‌వర్డ్‌ను రీసెట్ చేసి, యాక్టివేట్ చేయాలని ఆదేశించింది. విచారణ బృందానికి అవసరమైన పూర్తి సమాచారాన్ని అందించాలని స్పష్టం చేసింది.

విచారణ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. ప్రభాకర్ రావు దర్యాప్తునకు సహకరించకపోవడం వల్ల కేసులో పురోగతి లేదని తెలిపారు. ఆయన తన డివైజ్‌లను ఫార్మాట్ చేసి కీలకమైన ఎలక్ట్రానిక్ ఆధారాలను నాశనం చేశారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే, ఈ ఆరోపణలను ప్రభాకర్ రావు తరఫు న్యాయవాది డి.ఎస్. నాయుడు ఖండించారు. తన క్లయింట్ వ్యక్తిగత ఐక్లౌడ్ పాస్‌వర్డ్ మినహా అడిగిన అన్ని వివరాలనూ సిట్‌కు ఇచ్చారని, ఇప్పటికే 11 సార్లు విచారణకు హాజరై 18 గంటల పాటు ప్రశ్నలకు సమాధానమిచ్చారని తెలిపారు. భద్రతా నిబంధనల ప్రకారమే డిపార్ట్‌మెంట్ కంప్యూటర్ నిపుణులు డేటాను తొలగించారని, అందులో తన క్లయింట్ పాత్ర లేదని వివరించారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రభాకర్ రావు నేతృత్వంలోని ప్రత్యేక బృందం ప్రతిపక్ష నేతలు, వ్యాపారులు, జర్నలిస్టులు, చివరికి న్యాయమూర్తుల ఫోన్లను కూడా అక్రమంగా ట్యాపింగ్ చేసిందన్నది ప్రధాన ఆరోపణ. 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి తర్వాత ప్రభాకర్ రావు తన పదవికి రాజీనామా చేసి అమెరికా వెళ్లారు. ఈ కేసు వెలుగులోకి రావడంతో ఆయన పేరు నిందితుల జాబితాలో చేరింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో జూన్ 8న భారత్‌కు తిరిగి వచ్చి విచారణను ఎదుర్కొంటున్నారు.


More Telugu News