హెచ్‌సీఏలో కొత్త వివాదం.. రాచకొండ సీపీకి ఫిర్యాదు

  • నకిలీ బర్త్ డే సర్టిఫికెట్లతో లీగ్‌లలోకి ఎంట్రీ ఇస్తున్నట్లు ఆరోపణలు
  • ఎక్కువ వయస్సు ఉన్న ఆటగాళ్లకు తక్కువ వయస్సు విభాగంలో ఆడేందుకు అవకాశమిచ్చారనే ఆరోపణలు
  • ప్రతిభావంతులైన ఆటగాళ్లకు నష్టం జరుగుతుందనే వాదనలు
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ)లో నకిలీ బర్త్ సర్టిఫికెట్స్ వివాదం తీవ్ర దుమారం రేపుతోంది. ఈ వ్యవహారానికి సంబంధించి హెచ్‌సీఏతో పాటు పలువురు ఆటగాళ్లపై రాచకొండ సీపీకి ఫిర్యాదు అందింది. వయస్సు పైబడిన ఆటగాళ్లు నకిలీ బర్త్ సర్టిఫికెట్లతో లీగ్‌లలో ప్రవేశిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

గతంలో నకిలీ ధృవపత్రాలతో ఆడిన ఆరుగురు ఆటగాళ్లను బీసీసీఐ గుర్తించి వారిపై నిషేధం విధించింది. అయినప్పటికీ, హెచ్‌సీఏ అధికారులు ఎక్కువ వయస్సు కలిగిన ఆటగాళ్లకు తక్కువ వయస్సు విభాగంలో ఆడేందుకు అవకాశం కల్పిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. దీనివల్ల నిజమైన ప్రతిభావంతులైన ఆటగాళ్లకు నష్టం జరుగుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో అవినీతికి పాల్పడుతూ ప్రతిభ లేని ఆటగాళ్లను ప్రోత్సహిస్తున్న హెచ్‌సీఏ అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ అనంతరెడ్డి అనే వ్యక్తి రాచకొండ సీపీకి ఫిర్యాదు చేశారు. పలువురు ఆటగాళ్లు నకిలీ సర్టిఫికెట్లు సమర్పించారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు.


More Telugu News