'కె ర్యాంప్' మూవీ... టైటిల్ కు అర్థం ఇదేనా?

  • కిరణ్ అబ్బవరం హీరోగా కె-ర్యాంప్ మూవీ
  • టైటిల్‌పై దర్శకుడు జైన్స్ నాని వివరణ
  • ట్రైలర్ చూసి అంచనా వేయొద్దు, ఇది కుటుంబ కథాచిత్రం అని వెల్లడి
  • కథ విషయంలో హీరో కిరణ్ అబ్బవరం జోక్యం చేసుకోలేదు స్పష్టీకరణ
  • దీపావళి కానుకగా ఈ నెల 18న సినిమా గ్రాండ్ రిలీజ్
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన తాజా చిత్రం 'కె-ర్యాంప్' విడుదలకు సిద్ధమవుతోంది. అయితే, ఈ సినిమా టైటిల్‌పైనా, ట్రైలర్‌పైనా సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చపై దర్శకుడు జైన్స్ నాని స్పష్టతనిచ్చారు. ఇది యువతను ఆకట్టుకుంటూనే, కుటుంబమంతా కలిసి చూడగలిగే చిత్రమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. దీపావళి సందర్భంగా అక్టోబర్ 18న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది.

మంగళవారం జరిగిన ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు జైన్స్ నాని మాట్లాడుతూ, "కె-ర్యాంప్ అనే టైటిల్‌ను బూతు పదంగా అపోహ పడొద్దు. కథానాయకుడి పాత్ర పేరు కుమార్. అతని జీవితం కొన్ని ఇబ్బందుల్లో పడుతుంది. దాన్ని సూచిస్తూ 'ర్యాంప్' అనే పదం వాడాం. కథకు, హీరో క్యారెక్టర్‌కు సరిగ్గా సరిపోతుందని, ప్రేక్షకుల్లోకి వేగంగా వెళుతుందని భావించి ఈ టైటిల్ ఖరారు చేశాం" అని వివరించారు.

ట్రైలర్‌లో కనిపించిన కొన్ని డైలాగులపై ఆయన స్పందిస్తూ, "ఏ సినిమాకైనా ముందుగా యువతను ఆకట్టుకోవాలి. అందుకే ట్రైలర్‌ను ఆ విధంగా కట్ చేశాం. యూత్‌కు సినిమా నచ్చితే, వారే తమ కుటుంబ సభ్యులను థియేటర్లకు తీసుకొస్తారు. ఇది కచ్చితంగా తల్లిదండ్రులు చూడాల్సిన సినిమా. బలమైన కథతో పాటు ఆకట్టుకునే సన్నివేశాలు ఉంటాయి. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్లాక్ ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుంది" అని తెలిపారు.

హీరో కిరణ్ అబ్బవరంతో తన ప్రయాణం గురించి చెబుతూ, "కిరణ్‌తో ఏడాదిన్నర పాటు కలిసి పనిచేశాను. ఆయన బాడీ లాంగ్వేజ్‌కు తగ్గట్టుగా స్క్రిప్ట్‌లో మార్పులు చేశాం. కథ విషయంలో ఆయనెక్కడా జోక్యం చేసుకోలేదు, కేవలం సూచనలు మాత్రమే ఇచ్చారు. ఎక్కడా వృథా లేకుండా కేవలం 47 రోజుల్లోనే చిత్రీకరణ పూర్తి చేశాం" అని జైన్స్ నాని పేర్కొన్నారు.

ఈ చిత్రాన్ని హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్ బ్యానర్‌లపై రాజేష్ దండా, శివ బొమ్మకు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.


More Telugu News