బైకులు, కార్ల మధ్యలో గుర్రంపై దర్జాగా.. ఆరు పదుల వయసులో అదరగొట్టిన లక్ష్మారెడ్డి!

  • తెనాలి రోడ్లపై గుర్రంపై చక్కర్లు కొట్టిన రైతు లక్ష్మారెడ్డి 
  • ఎల్ఐసీ ప్రీమియం చెల్లించేందుకు గుర్రంపై రాక
  • గత 30 ఏళ్లుగా గుర్రమే ఆయన ప్రయాణ సాధనం
  • ఇప్పటివరకు 10 గుర్రాలను మార్చానని వెల్లడి
  • త్వరలో గుర్రపు బండి తయారు చేయిస్తానంటున్న రైతు
సోమవారం గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలో ఓ ఆసక్తికర దృశ్యం కనిపించింది. రద్దీగా ఉండే రోడ్లపై కార్లు, బైక్‌ల మధ్యలో ఓ వృద్ధుడు పంచెకట్టుతో గుర్రంపై దర్జాగా స్వారీ చేస్తూ అందరి దృష్టినీ ఆకర్షించారు. ఆయనెవరో, ఎందుకిలా వచ్చారో అని ఆరా తీయగా ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.

వివరాల్లోకి వెళితే... గుర్రంపై కనిపించిన ఆ వ్యక్తి పేరు లక్ష్మారెడ్డి (61). ఆయన బాపట్ల జిల్లా, చుండూరు మండలం కారుమూరువారిపాలెం గ్రామానికి చెందిన రైతు. తెనాలిలోని ఎల్ఐసీ కార్యాలయంలో తన పాలసీకి సంబంధించిన డబ్బులు చెల్లించేందుకు ఆయన తన గ్రామం నుంచి గుర్రంపై వచ్చారు. ఆధునిక వాహనాలున్న ఈ రోజుల్లో గుర్రంపై రావడం చూసి స్థానికులు ఆశ్చర్యపోయారు.

30 ఏళ్లుగా గుర్రంపై స్వారీ
ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, గత 30 సంవత్సరాలుగా తన ప్రయాణాలకు గుర్రాన్నే వాడుతున్నానని తెలిపారు. బైక్‌ల కన్నా గుర్రం ప్రయాణమే తనకు సౌకర్యంగా, ఆరోగ్యంగా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. పొలానికి వెళ్లాలన్నా, చుట్టుపక్కల గ్రామాలకు వెళ్లాలన్నా గుర్రమే తన వాహనమని చెప్పారు. అంతేకాకుండా, కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని బంధువుల ఇళ్లకు కూడా గుర్రంపైనే వెళ్తానని ఆయన వివరించారు. ఇప్పటివరకు తన ప్రయాణ అవసరాల కోసం 10 గుర్రాలను మార్చినట్లు లక్ష్మారెడ్డి తెలిపారు. భవిష్యత్తులో ఓ గుర్రపు బండిని కూడా తయారు చేయించుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు.


More Telugu News