పోలీస్ శాఖను మూసేయడమే మేలు.. ఏపీ పోలీసులపై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు

  • తిరుమల పరకామణి కేసులో పోలీసుల తీరుపై హైకోర్టు ఆగ్రహం
  • సీఐడీలో ఐజీ పోస్టు లేదన్న వాదనపై తీవ్ర అసహనం
  • ఆధారాలు తారుమారు చేయడానికే జాప్యమని అనుమానం
  • రికార్డులు వెంటనే సీజ్ చేయాలని హైకోర్టు ఆదేశం
  • తదుపరి విచారణ ఈ నెల 17కు వాయిదా
తిరుమల పరకామణి కేసు విచారణలో భాగంగా ఆంధ్రప్రదేశ్ పోలీసుల పనితీరుపై హైకోర్టు తీవ్రస్థాయిలో మండిపడింది. కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయడంలో తీవ్ర జాప్యం జరగడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఏకంగా రాష్ట్ర పోలీస్ శాఖను మూసివేయడమే మేలని సంచలన వ్యాఖ్యలు చేసింది.

పరకామణిలో జరిగిన అవకతవకలకు సంబంధించిన రికార్డులను స్వాధీనం చేసుకోవాలని సెప్టెంబర్ 19న ఆదేశాలు జారీ చేసినప్పటికీ, ఇంతవరకు ఆ పని పూర్తి చేయకపోవడాన్ని న్యాయస్థానం తప్పుబట్టింది. దీనిపై సీఐడీ ఇచ్చిన వివరణపై మరింత అసహనం వ్యక్తం చేసింది. సీఐడీలో ఐజీ స్థాయి అధికారి పోస్టు ఖాళీగా ఉందని, అందుకే ఆదేశాలు అమలు చేయలేకపోయామని చెప్పడంపై తీవ్రంగా స్పందించింది.

"ఒక పోస్టు లేదనే కారణంతో కోర్టు ఉత్తర్వులను పక్కన పెడతారా? డీజీపీ, మొత్తం పోలీస్ శాఖ నిద్రపోతోందా? ఇదేనా మీరు పనిచేసే విధానం?" అని ఉన్నత న్యాయస్థానం పోలీసులను సూటిగా ప్రశ్నించింది. ఇది కేవలం నిర్లక్ష్యం కాదని, కేసుకు సంబంధించిన కీలక ఆధారాలను తారుమారు చేసేందుకే ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తున్నారని అనుమానం వ్యక్తం చేసింది.

తక్షణమే ఐజీ స్థాయి అధికారిని నియమించి, తమ నిబద్ధతను చాటుకోవాలని పోలీస్ శాఖకు హైకోర్టు సూచించింది. పరకామణికి సంబంధించిన అన్ని రికార్డులను వెంటనే సీజ్ చేసి, తమ ముందు హాజరుపరచాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అనంతరం, తదుపరి విచారణను ఈ నెల 17వ తేదీకి వాయిదా వేసింది.


More Telugu News