ఇజ్రాయెల్ చట్టసభలో ప్రసంగించిన ట్రంప్.. మారణహోమం అంటూ పలువురు ఎంపీల నిరసన

  • కాల్పుల విరమణ ఒప్పందం విషయంలో విజయం సాధించామన్న ట్రంప్
  • థ్యాంక్యూ వెరీమచ్ బేబీ, గొప్ప పని చేశావంటూ నెతన్యాహుకు ప్రశంస
  • అమెరికాలో ఉన్న స్వర్ణయుగం ఇజ్రాయెల్‌లో ప్రారంభమైందన్న ట్రంప్
ఇజ్రాయెల్ - హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం విషయంలో తాము విజయం సాధించామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ఇజ్రాయెల్‌లో పర్యటిస్తున్న ఆయన ఆ దేశ చట్టసభలో మాట్లాడుతూ, "థ్యాంక్యూ వెరీమచ్ బేబీ, గొప్ప పని చేశావ్" అంటూ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహును ప్రశంసించారు.

ట్రంప్ ప్రసంగిస్తూ, మధ్యప్రాచ్యంలో సరికొత్త చరిత్ర ఆరంభమవుతోందని, ఈ పవిత్ర భూమిలో శాంతి నెలకొనడంతో ఆకాశం నిర్మలంగా మారిందని అన్నారు. ఈ ప్రాంతంలో తుపాకులు మూగబోయాయని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం అమెరికాలో ఉన్న స్వర్ణయుగం ఇజ్రాయెల్‌లో ప్రారంభమైందని, బందీలు తిరిగి రావడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు.

కాల్పుల విరమణ ఒప్పందం విషయంలో తాము సమయం వృథా చేస్తున్నామని చాలామంది అభిప్రాయపడ్డారని, కానీ చివరకు విజయం సాధించామని ట్రంప్ అన్నారు. అమెరికా ఎల్లప్పుడూ అండగా ఉంటుందని బాధిత కుటుంబాలకు ఆయన భరోసా ఇచ్చారు.

ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంలో మధ్యప్రాచ్యంలో అమెరికా ప్రత్యేక రాయబారిగా ఉన్న స్టీవ్ విట్కాఫ్, ఆయన సలహాదారు జేర్న్ కుష్నర్ కీలక పాత్ర పోషించారని ట్రంప్ కొనియాడారు. ట్రంప్ ప్రసంగిస్తున్న సమయంలో కొందరు ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు. "మారణహోమం" అంటూ నినాదాలు చేయడంతో వారిని సభ నుంచి బయటకు పంపించేశారు. ఈ నిరసనలపై సభాపతి ట్రంప్‌కు క్షమాపణ చెప్పారు.


More Telugu News