దగ్గుమందుతో చిన్నారుల మృతి.. తమిళనాడులో కోల్డ్‌రిఫ్ కంపెనీ మూసివేత

  • అనుమతులు రద్దు చేసినట్లు తమిళనాడు డ్రగ్స్ కంట్రోల్ విభాగం వెల్లడి
  • రాష్ట్రంలోని ఇతర ఔషధ తయారీ సంస్థల్లో తనిఖీలు నిర్వహించాలని ఆదేశం
  • ఇదిమరకే కంపెనీ యజమానిని అరెస్టు చేసిన దర్యాప్తు బృందం
కోల్డ్‌రిఫ్ దగ్గు మందు తయారీ సంస్థ శ్రేసన్ ఫార్మా అనుమతులను తమిళనాడు ప్రభుత్వం రద్దు చేసింది. ఈ మేరకు అనుమతులు రద్దు చేసినట్లు తమిళనాడు డ్రగ్స్ కంట్రోల్ విభాగం వెల్లడించింది. కంపెనీ మూసివేతకు కూడా ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపింది. రాష్ట్రంలోని ఇతర ఔషధ తయారీ సంస్థల్లో తనిఖీలు నిర్వహించాలని ఆదేశించినట్లు పేర్కొంది.

కోల్డ్‌రిఫ్ దగ్గు మందు కారణంగా మధ్యప్రదేశ్‌లో 20 మందికి పైగా చిన్నారులు మరణించారు. ఇది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ దగ్గు మందును తమిళనాడులోని కాంచీపురానికి చెందిన శ్రేసన్ ఫార్మా యూనిట్ తయారు చేసింది. మరణాల నేపథ్యంలో ఈ కంపెనీలో తనిఖీలు నిర్వహించగా సిరప్‌లో 48.6 శాతం అత్యంత విషపూరితమైన డైఇథైలిన్ గ్లైకాల్ ఉందని తెలిసినట్లు అధికారులు తెలిపారు.

సరైన తయారీ పద్ధతులు అవలంబించలేదని, 300కు పైగా ఉల్లంఘనలను రికార్డు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ప్రత్యేక దర్యాప్తు బృందం ఇప్పటికే కంపెనీ యజమానిని అరెస్టు చేసింది. ఈరోజు ఉదయం ఫార్మా సంస్థకు చెందిన పలు ప్రాంగణాల్లో ఈడీ తనిఖీలు నిర్వహించింది.

దగ్గు మందు మరణాలకు తమిళనాడు అధికారుల నిర్లక్ష్యమే కారణమని దర్యాప్తులో భాగంగా కేంద్ర ఔషధ నియంత్రణ సంస్థ గుర్తించినట్లు మీడియా కథనాలు వచ్చాయి. రాష్ట్ర ఔషధ నియంత్రణ సంస్థ నిబంధనలను విస్మరించిందని, కేంద్రం చేసిన సిఫార్సులకు అనుగుణంగా చర్యలు తీసుకోవడంలో విఫలమైందని తేలింది. దగ్గు మందు తయారీ విషయంలో సరైన పర్యవేక్షణ లేదని, సకాలంలో చర్యలు తీసుకోకపోవడంతో విషపూరితమైన సిరప్ మార్కెట్‌లోకి వచ్చిందని, ఆ నిర్లక్ష్యం పిల్లల మరణాలకు దారి తీసిందని జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి.


More Telugu News