గురుకులంలో విద్యార్థిని ఆత్మహత్య.. హాస్టల్ వాతావరణమే కారణమా?

  • మహబూబ్‌నగర్ గురుకుల పాఠశాలలో విద్యార్థిని ఆత్మహత్య
  • హాస్టల్ బాత్రూంలో ఉరేసుకొని బలవన్మరణం
  • హాస్టల్ నచ్చలేదని మూడు రోజుల క్రితమే తల్లిదండ్రులకు ఫోన్
  • అసౌకర్యంగా ఉండటం వల్లే ఆత్మహత్య చేసుకుందన్న తండ్రి
  • ఘటనపై పూర్తిస్థాయి విచారణకు ఆదేశించిన కలెక్టర్
  • మృతురాలి వద్ద సూసైడ్ నోట్ లభ్యం
జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రభుత్వ గురుకుల పాఠశాలలో చదువుతున్న ఓ ఇంటర్ విద్యార్థిని హాస్టల్‌లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. హాస్టల్ వాతావరణం నచ్చకపోవడమే ఈ దారుణానికి కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తుండగా, ఈ ఘటనపై అధికారులు విచారణకు ఆదేశించారు.

పూర్తి వివరాల్లోకి వెళితే... గద్వాల జిల్లా మల్దకల్ పట్టణానికి చెందిన ప్రియాంక (15) మహబూబ్‌నగర్ మండలం రామ్ రెడ్డి గూడెం సోషల్ వెల్ఫేర్ గురుకులంలో ఇంటర్ మొదటి సంవత్సరం (ఎంపీసీ) చదువుతోంది. సోమవారం ఉదయం ఆమె బాత్రూంకి వెళ్లి చాలాసేపటికీ బయటకు రాలేదు. అనుమానం వచ్చిన తోటి విద్యార్థులు వార్డెన్‌కు సమాచారం అందించారు. సిబ్బంది వచ్చి తలుపులు పగలగొట్టి చూడగా, ఆమె ఉరేసుకొని వేలాడుతూ కనిపించింది. హుటాహుటిన ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించినప్పటికీ, అప్పటికే ప్రియాంక మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.

మూడు రోజుల క్రితమే ప్రియాంక తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి, హాస్టల్‌లో వాతావరణం బాగోలేదని, ఇక్కడ చదవలేనని, ఇంటికి వచ్చేస్తానని చెప్పినట్లు తెలుస్తోంది. అయితే, తాము సోమవారం వచ్చి మాట్లాడతామని తల్లిదండ్రులు ఆమెకు నచ్చజెప్పారు. వారు వచ్చేలోపే ఈ ఘోరం జరిగిపోయింది.

హాస్టల్‌లో 800 మందికి పైగా విద్యార్థులు ఉండటంతో తీవ్ర అసౌకర్యంగా ఉందని, అందుకే తన కూతురు ఈ అఘాయిత్యానికి పాల్పడిందని మృతురాలి తండ్రి నగేష్ ఆరోపించారు. తమ కుమార్తె మృతిపై తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ జయేంద్ర పోయి ఆసుపత్రికి చేరుకొని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఘటనపై పూర్తిస్థాయి విచారణకు ఆదేశించారు. ప్రియాంక వద్ద ఒక సూసైడ్ నోట్ లభించిందని కళాశాల ప్రిన్సిపాల్ చెప్పడంతో ఆ లేఖలో ఏముందనేది దర్యాప్తులో కీలకంగా మారింది.




More Telugu News