గాజాలో కీలక పరిణామం... ఏడుగురు బందీలను విడుదల చేసిన హమాస్

  • హమాస్ చెర నుంచి ఏడుగురు ఇజ్రాయెలీ బందీలకు విముక్తి
  • రెడ్‌క్రాస్‌కు అప్పగించిన హమాస్.. ఐడీఎఫ్ దళాల వైపు ప్రయాణం
  • కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా తొలి విడత విడుదల
  • మొదటి దశలో 20 మందిని విడుదల చేస్తామన్న హమాస్
  • బందీల స్వీకరణకు సర్వం సిద్ధం చేసిన ఇజ్రాయెల్ ఎయిర్‌ఫోర్స్
గాజాలో కొనసాగుతున్న ఉత్కంఠకు తెరదించుతూ హమాస్ ఉగ్రవాదులు బందీలుగా పట్టుకున్నవారిలో మొదటి బృందాన్ని విడుదల చేశారు. కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా ఏడుగురు ఇజ్రాయెలీ బందీలను సోమవారం విడిచిపెట్టారు. హమాస్ చెర నుంచి విడుదలైన ఈ బృందాన్ని రెడ్‌క్రాస్ సంస్థ తమ అదుపులోకి తీసుకుంది. అనంతరం వారిని గాజా స్ట్రిప్‌లోని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్), షిన్ బెట్ దళాలకు అప్పగించే ప్రక్రియ కొనసాగుతోంది.

విడుదలైన వారిలో గాలి బెర్మన్, జివ్ బెర్మన్, మతన్ ఆంగ్రెస్ట్, అలోన్ ఓహెల్, ఓమ్రీ మిరన్, ఇటాన్ మోర్, గై గిల్బోవా-దలాల్ ఉన్నట్లు ఇజ్రాయెల్ సైన్యం ఒక ప్రకటనలో ధ్రువీకరించింది. "రెడ్‌క్రాస్ నుంచి అందిన సమాచారం ప్రకారం, ఏడుగురు బందీలు వారి అధీనంలో ఉన్నారు. వారు గాజా స్ట్రిప్‌లోని మా దళాల వైపు వస్తున్నారు" అని ఐడీఎఫ్ స్పష్టం చేసింది. బందీలను ఇజ్రాయెల్‌కు తరలించేందుకు తమ ఎయిర్‌ఫోర్స్ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసిందని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. రెండో విడతలో మరికొంత మందిని స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నట్లు తెలిసింది.

ఈ ఒప్పందం తమ ప్రజల స్థైర్యం, ప్రతిఘటన యోధుల పట్టుదల వల్లే సాధ్యమైందని హమాస్ మిలిటరీ విభాగం అల్-ఖస్సామ్ బ్రిగేడ్స్ ఒక ప్రకటనలో పేర్కొంది. ఇజ్రాయెల్ ఒప్పందానికి కట్టుబడి ఉన్నంత కాలం తాము కూడా దానికి లోబడి ఉంటామని స్పష్టం చేసింది. "చాలా నెలల క్రితమే ఇజ్రాయెల్ తమ బందీలలో చాలా మందిని ప్రాణాలతో తీసుకెళ్లే అవకాశం ఉన్నప్పటికీ, వారు కాలయాపన చేస్తూ వచ్చారు" అని హమాస్ ఆరోపించింది. తొలి దశలో 20 మంది ఇజ్రాయెలీ బందీలను విడుదల చేస్తామని హమాస్ అంతకుముందు ప్రకటించింది.

ఈ పరిణామాల నేపథ్యంలో ఐడీఎఫ్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఇయల్ జమీర్ ఉన్నతాధికారులతో సైనిక ప్రధాన కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. బందీల విడుదల ప్రక్రియలో పాల్గొంటున్న అన్ని విభాగాల సంసిద్ధతను ఆయన అభినందించారు. అలాగే, అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన ప్రాముఖ్యతను నొక్కిచెప్పినట్లు ఐడీఎఫ్ తెలిపింది.

ఇదిలాఉంటే... 2023 అక్టోబర్ 7న హమాస్ అత్యంత దారుణంగా మారణహోమం సృష్టించిన నోవా ఫెస్టివల్ ప్రదేశంలో వేలాది మంది ఇజ్రాయెలీలు ప్రత్యేక ప్రార్థనల కోసం గుమిగూడారు. తమ వారు క్షేమంగా తిరిగి రావాలని ఆకాంక్షిస్తూ ప్రార్థనలు జరిపారు.



More Telugu News