పాకిస్థాన్‌కు తాలిబన్ల తీవ్ర హెచ్చరిక.. శాంతిని పాక్ ఆర్మీలోని ఒక వర్గం చెడగొడుతోందని మండిపాటు

  • పాక్ సైన్యంలోని ఓ వర్గమే అశాంతికి కారణమన్న తాలిబన్లు
  • ప్రతీకార దాడుల్లో 58 మంది పాక్ సైనికులను చంపామని ప్రకటన
  • 20కి పైగా పాకిస్థాన్ సైనిక పోస్టులను స్వాధీనం చేసుకున్న ఆఫ్ఘన్ దళాలు
  • తమ దేశంలో శాంతిని చూసి పాక్ సైన్యం ఓర్వలేకపోతోందని ఆరోపణ
  • కవ్వింపు చర్యలు ఆపకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరిక
తమ దేశంలో శాంతి, పురోగతిని చూసి పాకిస్థాన్ సైన్యంలోని ఓ వర్గం ఓర్వలేకపోతోందని ఆఫ్ఘనిస్థాన్ లోని తాలిబన్ ప్రభుత్వం సంచలన ఆరోపణలు చేసింది. ఇరు దేశాల మధ్య వివాదాస్పదంగా ఉన్న డ్యూరాండ్ లైన్ వెంబడి ఉద్రిక్తతలను ఆ వర్గమే ఉద్దేశపూర్వకంగా రెచ్చగొడుతోందని తీవ్రంగా విమర్శించింది. ఈ ఘర్షణల్లో 58 మంది పాక్ సైనికులను హతమార్చినట్లు తాలిబన్ అధికార ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ ప్రకటించారు.

పాకిస్థాన్ తమ గగనతలాన్ని ఉల్లంఘించి పక్తికా ప్రావిన్స్‌లోని బెర్మల్ జిల్లాపై దాడులు జరిపిందని, దీనికి ప్రతీకారంగానే తాము ఎదురుదాడికి దిగామని ముజాహిద్ తెలిపారు. శనివారం రాత్రి ఆఫ్ఘన్ దళాలు కాందహార్, నంగర్‌హార్ సహా ఆరు ప్రావిన్సులలోని పాకిస్థాన్ సైనిక స్థావరాలపై ఏకకాలంలో దాడులు ప్రారంభించాయని ఆయన వివరించారు. ఈ దాడుల్లో 58 మంది పాక్ సైనికులు మరణించగా, 30 మంది గాయపడ్డారని, 20కి పైగా సైనిక పోస్టులను తమ అధీనంలోకి తీసుకున్నామని చెప్పారు. ఈ ఆపరేషన్‌లో తమ వైపు కేవలం 9 మంది సైనికులు మాత్రమే అమరులయ్యారని ఆయన పేర్కొన్నారు. మరోవైపు, పాక్ సైన్యం మాత్రం తమ సైనికుల్లో 23 మంది మరణించినట్లు అంగీకరించింది.

పాకిస్థాన్‌లోని అంతర్గత వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే అక్కడి సైన్యంలోని ఓ వర్గం ఈ గందరగోళాన్ని సృష్టిస్తోందని ముజాహిద్ ఆరోపించారు. ఆఫ్ఘనిస్థాన్‌కు వ్యతిరేకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని, తమ దేశంలోని ఐసిస్ స్థావరాలను ఉద్దేశపూర్వకంగా విస్మరిస్తున్నారని విమర్శించారు. ఐసిస్ ఖొరాసన్ మూలాలు పాకిస్థాన్‌లోని ఒరక్‌జాయ్ ప్రాంతంలోనే ఉన్నాయని, ఇటీవల టెహ్రాన్, మాస్కోలలో జరిగిన దాడులకు కూడా పాక్‌లోని స్థావరాల నుంచే ప్రణాళికలు రచించారని ఆయన అన్నారు. ఐసిస్-కె నాయకుడు షహాబ్ అల్-ముహాజిర్ ప్రస్తుతం పాకిస్థాన్‌లోనే ఆశ్రయం పొందుతున్నాడని, అతడిని తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు.

సరిహద్దు వెంబడి కవ్వింపు చర్యలను, గగనతల ఉల్లంఘనలను పాకిస్థాన్ వెంటనే ఆపాలని ముజాహిద్ హెచ్చరించారు. లేనిపక్షంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. తమ దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి వెనుకాడబోమని స్పష్టం చేశారు. తాము చర్చలకు సిద్ధంగా ఉన్నప్పటికీ, ఎవరైనా యుద్ధాన్ని కోరుకుంటే దానికి కూడా ఆఫ్ఘనిస్థాన్ సిద్ధంగా ఉందని ఆయన ప్రకటించారు.


More Telugu News