మేం ప్యాలెస్‌లు కట్టడానికి విశాఖ రాలేదు... మా లక్ష్యం అదే: మంత్రి నారా లోకేశ్

  • విశాఖను ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యమన్న లోకేశ్
  • రాష్ట్రానికి రానున్న 10 లక్షల కోట్ల పెట్టుబడుల్లో 50 శాతం విశాఖ రీజియన్‌కే
  • వచ్చే ఐదేళ్లలో నగరంలో 5 లక్షల ఐటీ ఉద్యోగాల కల్పన
  • నవంబర్‌లో టీసీఎస్, కాగ్నిజెంట్ కార్యకలాపాల ప్రారంభం
  • టీసీఎస్‌కు 99 పైసలకే భూమి కేటాయింపులో తప్పేంటి అని సూటి ప్రశ్న
  • నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖలో సీఐఐ భాగస్వామ్య సదస్సు
ఆంధ్రప్రదేశ్‌కు ఆర్థిక చోదకశక్తిగా ఉన్న విశాఖపట్నాన్ని ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. రాష్ట్రానికి రానున్న రూ.10 లక్షల కోట్ల పెట్టుబడుల్లో సగం గ్రేటర్ విశాఖ ఎకనామిక్ రీజియన్‌కే వస్తున్నాయని, ఇది అభివృద్ధి పట్ల తమ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమని అన్నారు. విశాఖ కలెక్టరేట్‌లో ఉత్తరాంధ్ర జిల్లాల కలెక్టర్లు, ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు.

విశాఖ అభివృద్ధి విషయంలో కూటమి ప్రభుత్వం అత్యంత వేగంగా అడుగులు వేస్తోందని లోకేశ్ తెలిపారు. ఇప్పటికే నగరంలో సిఫీ ఆధ్వర్యంలో డేటా సెంటర్‌కు శంకుస్థాపన చేశామని గుర్తుచేశారు. "రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను 2.4 ట్రిలియన్ డాలర్లకు చేర్చాలంటే, అందులో విశాఖ రీజియన్ వాటా కనీసం ఒక ట్రిలియన్ డాలర్లు ఉండాలనే బృహత్తర లక్ష్యంతో పనిచేస్తున్నాం. మేము ప్యాలెస్‌లు కట్టడానికి విశాఖ రాలేదు. యువతకు ఉద్యోగాలు, ఉపాధి కల్పించే పరిశ్రమలను తీసుకురావడానికే వచ్చాం" అని ఆయన వివరించారు. రాష్ట్రానికి రానున్న రూ.10 లక్షల కోట్ల పెట్టుబడుల్లో రూ.5 లక్షల కోట్లు విశాఖ ప్రాంతానికే దక్కనున్నాయని, ఇది ఈ ప్రాంత అభివృద్ధిపై ప్రభుత్వానికి ఉన్న ప్రత్యేక దృష్టిని తెలియజేస్తోందని పేర్కొన్నారు.

రాబోయే రోజుల్లో విశాఖ రూపురేఖలు మార్చే అనేక కీలక ప్రాజెక్టులు ప్రారంభం కానున్నాయని లోకేశ్ వెల్లడించారు. నవంబర్‌లో టీసీఎస్ సంస్థ తన కార్యకలాపాలు ప్రారంభిస్తుందని, అదే నెలలో కాగ్నిజెంట్ సీఈవో విశాఖకు వచ్చి కొత్త ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తారని తెలిపారు. డిసెంబర్‌లో కాగ్నిజెంట్ డెవలప్‌మెంట్ సెంటర్ కూడా ప్రారంభమవుతుందని చెప్పారు. వీటితో పాటు ఏఎన్ఎస్ఆర్ సత్వా, యాక్సెంచర్, గూగుల్, సిఫీ, ఆర్సెల్లర్ మిట్టల్ వంటి దిగ్గజ సంస్థలతో పాటు ఫార్మా రంగంలో మరో ఐదు కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చాయని అన్నారు. గూగుల్ పెట్టుబడులకు సంబంధించి త్వరలోనే ఢిల్లీలో ఒక పెద్ద ప్రకటన చేయనున్నట్లు సంకేతమిచ్చారు.

ప్రతి పరిశ్రమను క్షేత్రస్థాయిలో నిలబెడతామని హామీ ఇచ్చారు. గ్రేటర్ విశాఖ ఎకనామిక్ రీజియన్‌కు అవసరమైన మౌలిక సదుపాయాలు, ఎకో సిస్టమ్‌పై నాలుగు జిల్లాల కలెక్టర్లతో చర్చించామని, రోడ్లు, ప్రభుత్వ భూముల లభ్యత వంటి అంశాలపై సమీక్షించామని తెలిపారు.

'ఒకే రాష్ట్రం-ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ' అనే నినాదంతోనే తాము ప్రజల ముందుకు వచ్చామని, ప్రజలు 94 శాతం సీట్లతో తమను గెలిపించారని లోకేశ్ గుర్తుచేశారు. సంక్షేమం, అభివృద్ధిని జోడెద్దుల బండిలా ముందుకు తీసుకెళతామని, రాబోయే ఐదేళ్లలో విశాఖలో ఐటీ రంగంలోనే 5 లక్షల ఉద్యోగాలు సృష్టిస్తామని ఆయన భరోసా ఇచ్చారు. దీనికోసం సమగ్ర ప్రణాళికతో ముందుకెళుతున్నామని, నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖలోనే సీఐఐ భాగస్వామ్య సదస్సును నిర్వహిస్తున్నామని తెలిపారు.


More Telugu News