విశాఖలో వరల్డ్ కప్ మ్యాచ్... స్టేడియంలో సందడి చేసిన ఏపీ మంత్రి నారా లోకేశ్

  • విశాఖలో టీమిండియా, ఆస్ట్రేలియా మ్యాచ్
  • హాజరైన మంత్రి లోకేశ్, జై షా
  • స్టేడియం గ్యాలరీకి మిథాలీ రాజ్ పేరు నామకరణం
  • స్టేడియం మూడో గేటుకు రావి కల్పన పేరు
  • ఐసీసీ మహిళల వరల్డ్ కప్ మ్యాచ్ వేళ ఈ కార్యక్రమం
  • పాల్గొన్న బీసీసీఐ నూతన అధ్యక్షుడు, ఏసీఏ పెద్దలు
  • మహిళా దిగ్గజాలను గౌరవించడమే లక్ష్యమన్న ఏసీఏ
విశాఖపట్నంలోని ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో భారత మహిళా క్రికెట్ దిగ్గజాలకు అరుదైన గౌరవం దక్కింది. ఐసీసీ మహిళల ప్రపంచ కప్ టోర్నమెంట్‌లో భాగంగా టీమిండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ సందర్భంగా, స్టేడియంలోని ఒక గ్యాలరీకి, ఒక గేటుకు మహిళా క్రికెటర్ల పేర్లు పెట్టారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి నారా లోకేశ్, ఐసీసీ చైర్మన్ జై షా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, లెజెండరీ బ్యాటర్ మిథాలీ రాజ్ పేరును స్టేడియంలోని ‘ఏ-గ్యాలరీ’కి నామకరణం చేశారు. అదేవిధంగా, స్టేడియంలోని మూడో నంబర్ గేటుకు మాజీ వికెట్ కీపర్ రావి కల్పన పేరును పెట్టారు. మంత్రి లోకేశ్, జై షా ఈ నామకరణ కార్యక్రమాలను లాంఛనంగా ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో బీసీసీఐ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన మిథున్ మన్హాస్‌తో పాటు, ఆంధ్రా క్రికెట్ సంఘం (ఏసీఏ) అధ్యక్షుడు కేశినేని శివనాథ్, ఏసీఏ కార్యదర్శి సానా సతీశ్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఏసీఏ అధ్యక్షుడు కేశినేని శివనాథ్ మాట్లాడారు. మహిళా క్రికెట్‌కు ఎనలేని సేవలు అందించిన మిథాలీ రాజ్, రావి కల్పన వంటి దిగ్గజాలను గౌరవించుకోవడం తమ బాధ్యత అని ఆయన అన్నారు. ఆంధ్రా క్రికెట్ సంఘం తీసుకున్న ఈ నిర్ణయాన్ని క్రీడాభిమానులు స్వాగతిస్తున్నారని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.


More Telugu News