ఎల్‌బీనగర్‌లో కారు హల్‌చల్.. డివైడర్ దాటి, మూడు పల్టీలు కొట్టి బీభత్సం

  • గుర్రంగూడలో అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం
  • మద్యం మత్తులో థార్ డ్రైవర్ అతివేగంతో బీభత్సం
  • ముందుగా బైక్‌ను, తర్వాత మరో కారును ఢీకొట్టిన వాహనం
  • అదుపుతప్పి డివైడర్ దాటి మూడు పల్టీలు
  • ప్రమాదంలో ఐదుగురికి తీవ్ర గాయాలు
హైదరాబాద్‌లోని ఎల్‌బీనగర్‌ నియోజకవర్గంలో శనివారం అర్ధరాత్రి ఓ థార్ కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో ఉన్న డ్రైవర్ అతివేగంతో వాహనాన్ని నడిపి వరుస ప్రమాదాలకు కారణమయ్యాడు. ఈ ఘటనలో మొత్తం ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. బీఎన్‌రెడ్డినగర్‌ సమీపంలోని గుర్రంగూడ వద్ద ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.

ఇంజాపూర్ నుంచి గుర్రంగూడ వైపు వేగంగా దూసుకొచ్చిన థార్ కారు అదుపు తప్పింది. తొలుత రోడ్డుపై వెళ్తున్న ఓ బైక్‌ను బలంగా ఢీకొట్టింది. ఆ బైక్‌పై సిరిసిల్లకు చెందిన ఇద్దరు విద్యార్థులు ప్రయాణిస్తుండగా, ఈ ప్రమాదంలో విద్యార్థినికి తీవ్ర గాయాలయ్యాయి. మెరుగైన చికిత్స కోసం ఆమెను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అంతటితో ఆగకుండా ఆ థార్ కారు డివైడర్‌ను దాటుకుని ఎదురుగా వస్తున్న మరో కారును ఢీకొట్టింది.

ఆ తర్వాత వాహనం గాల్లోకి లేచి మూడు పల్టీలు కొట్టి రోడ్డుపై పడిపోయింది. ఈ ప్రమాదంలో థార్ వాహనంలో ఉన్న డ్రైవర్‌తో పాటు యజమాని అనిరుధ్‌కు తలకు తీవ్ర గాయాలయ్యాయి. అలాగే, రెండో కారులో ప్రయాణిస్తున్న దినేష్, శివ అనే ఇద్దరు వ్యక్తులు కూడా గాయపడ్డారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే స్థానికులు క్షతగాత్రులను హస్తినాపురంలోని రెండు వేర్వేరు ఆస్పత్రులకు తరలించారు. ప్రస్తుతం వారంతా చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


More Telugu News