హర్యానా అడిషనల్ డీజీపీ పూరన్ కుమార్ ఆత్మహత్యపై సీఎం రేవంత్ రెడ్డి స్పందన

  • కుల ఉన్మాదానికి ఐపీఎస్ అధికారి ఆత్మహత్య ఒక ఉదాహరణ అన్న సీఎం రేవంత్ రెడ్డి 
  • అణగారిన వర్గాలపై జరుగుతున్న సామాజిక అన్యాయానికి ఇది నిదర్శనమన్న సీఎం
  • ప్రతి ఒక్కరూ అణచివేత చర్యలను తీవ్రంగా ఖండించాలన్న సీఎం రేవంత్
కుల ఉన్మాదానికి ఐపీఎస్ అధికారి ఆత్మహత్య ఒక ఉదాహరణ అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన హర్యానా కేడర్‌ ఐపీఎస్ అధికారి, అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఏడీజీపీ) వై. పూరన్ కుమార్ ఆత్మహత్య చేసుకోవడం పట్ల ఆయన ఎక్స్ వేదికగా స్పందిస్తూ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.

ఈ ఘటన అణగారిన వర్గాలపై జరుగుతున్న సామాజిక అన్యాయానికి నిదర్శనమని ముఖ్యమంత్రి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. "కులం పేరుతో ఒక సీనియర్ ఐపీఎస్ అధికారిని వేధించడం చూస్తే, సామాన్య ప్రజల దుస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు," అని ఆయన వ్యాఖ్యానించారు.

కుల ఉన్మాదం దేశ సమాజాన్ని పీడిస్తోందని, అణగారిన వర్గాల పట్ల ద్వేషం సమాజాన్ని విషపూరితం చేస్తోందని రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ తరహా సంఘటనల వల్ల రాజ్యాంగం, సమానత్వం, న్యాయ వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం దెబ్బతింటోందన్నారు.

సామాజిక న్యాయం కోసం ప్రతి ఒక్కరూ అణచివేత చర్యలను తీవ్రంగా ఖండించాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. పూరన్ కుమార్ కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. 


More Telugu News