ఏపీ నుంచి సింగపూర్ కు ఇండిగో విమానం: కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు

  • నవంబర్ 15 నుంచి సింగపూర్ సర్వీస్ ప్రారంభం 
  • వారానికి మూడు రోజులు సర్వీసును నడపనున్న ఇండిగో సంస్థ
  • ఇంటర్నేషనల్ కనెక్టివిటీని మరింత విస్తృతం చేస్తామన్న కేంద్ర మంత్రి  రామ్మోహన్ నాయుడు
విజయవాడ-సింగపూర్ మధ్య నూతన విమాన సర్వీసును ఇండిగో సంస్థ మరి కొద్ది రోజుల్లో ప్రారంభించనుంది. ఈ సేవను విజయవాడ నగర ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఈ సర్వీసుకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు.

విజయవాడ నుండి వారానికి మూడు రోజులు మంగళ, గురు, శనివారాల్లో ఈ సర్వీసు ఉండనుందని, నవంబర్ 15 నుండి ఇండిగో విమాన సర్వీసు ప్రారంభం కానుందని రామ్మోహన్ నాయుడు తెలిపారు. విజయవాడ నుండి సింగపూర్‌లోని చాంగీ విమానాశ్రయానికి వారానికి మూడు సార్లు నేరుగా ఈ విమాన సర్వీసు అందుబాటులో ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

ఈ ఏడాది జూలై 28న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటన సందర్భంగా ఈ విషయం చర్చకు వచ్చిందని రామ్మోహన్ నాయుడు గుర్తు చేశారు. ప్రవాసాంధ్రుల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు వంద రోజుల్లోనే ఈ సర్వీసును ఏర్పాటు చేశామని ఆయన స్పష్టం చేశారు.

స్వర్ణాంధ్ర 2047లో ప్రవాసాంధ్రుల పాత్ర అత్యంత కీలకమైనదని రామ్మోహన్ నాయుడు అన్నారు. చంద్రబాబు నాయుడు తన విజన్‌ను స్పష్టంగా అమలు చేస్తున్న నేపథ్యంలో విమానయాన అవసరాలు పెరుగుతాయని, భవిష్యత్తులో కోటికి పైగా ప్రవాసాంధ్రులు ప్రయాణాలు జరిపే అవకాశం ఉండటంతో అంతర్జాతీయ కనెక్టివిటీని మరింత విస్తృతం చేస్తామని ఆయన స్పష్టం చేశారు.

ప్రజలు, వ్యాపారవేత్తలు, విద్యార్థుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ విమాన సర్వీసును అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు ఆయన తెలిపారు. విజయవాడ ప్రాంత ప్రజలు, ప్రజా ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, విద్యార్థి సంఘాలు ఈ సర్వీసు పట్ల ఆసక్తిగా ఉన్న నేపథ్యంలో, వారి అభ్యర్థన మేరకు కేంద్రం సానుకూలంగా స్పందించడంతో నూతన విమాన సర్వీసు ఏర్పాటుకు రామ్మోహన్ నాయుడు చొరవ తీసుకున్నారు.

ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఈ సౌకర్యం తెలుగు ప్రవాస భారతీయులకు ఎంతగానో ఉపయోగపడుతుందని, వ్యాపార, సాంస్కృతిక బంధాలను మరింత బలపరుస్తుందని శ్రీ సాంస్కృతిక కళాసారధి సింగపూర్ అధ్యక్షుడు రత్నకుమార్ కవుటూరు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో పాటు సీఎం చంద్రబాబుకు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. 


More Telugu News