ఉద్యోగాలు వెతికేవారుగా కాకుండా ఉద్యోగాలు ఇచ్చేవారుగా యువత ఉండాలి: కేటీఆర్

  • కోయంబత్తూరులో ఎఫ్ఎంఏఈ కార్యక్రమానికి అతిథిగా హాజరైన కేటీఆర్
  • అవకాశాల కోసం ఎదురుచూడకుండా మీరే సృష్టించుకోవాలని యువతకు పిలుపు
  • పెద్ద కలలు కనడం ప్రారంభించిన తర్వాత మీ సామర్థ్యాన్ని చూసి మీరే ఆశ్చర్యపోతారని వ్యాఖ్య
  • తెలంగాణ రాష్ట్ర సాధన ప్రయాణాన్ని గుర్తుచేసిన కేటీఆర్
ఉద్యోగులు వెతికేవారుగా కాకుండా, ఉద్యోగాలు ఇచ్చేవారుగా నేటి యువత ఉండాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కోయంబత్తూరులో జరిగిన 10వ ఎఫ్‌ఎంఏఈ - నేషనల్ స్టూడెంట్ మోటార్‌స్పోర్ట్స్ 2025కి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ, అవకాశాల కోసం ఎదురుచూడకుండా మీరే సృష్టించుకోవాలని పిలుపునిచ్చారు. పెద్ద కలలు కనడం ప్రారంభించిన తర్వాత మీ సొంత సామర్థ్యాన్ని చూసి మీరే ఆశ్చర్యపోతారని ఆయన అన్నారు.

ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సాధన ప్రయాణాన్ని కేటీఆర్ గుర్తుచేశారు. ఒకప్పుడు రాష్ట్ర ఏర్పాటు సాధ్యం కాదని చాలామంది సందేహించారని, అలాంటి రాష్ట్రాన్ని సాధించామని పేర్కొన్నారు. 11 సంవత్సరాల తర్వాత ఎన్నో రంగాల్లో దేశానికి ఆదర్శంగా తెలంగాణ నిలబడిందని వ్యాఖ్యానించారు. తెలంగాణ సాధించిన ప్రగతి విశ్వాసానికి, పట్టుదలకు, దార్శనికతకు నిదర్శనమని అన్నారు.

మీరు ఇతరులు అనుకున్న దాని కంటే చాలా తెలివైన వారని, బాధ్యత కలిగిన వారని జెన్ జెడ్‌ను ఉద్దేశించి అన్నారు. భారతదేశాన్ని ముందుకు నడిపించేది మీరేనని వ్యాఖ్యానించారు. మోటార్ స్పోర్ట్స్ అయినా, జీవితమైనా విజయం కేవలం యాదృచ్ఛికంగా రాదని సూచించారు. మనం అవకాశాలను రూపొందించుకోవాలని, ధైర్యంతో అమలు చేయాలని, అప్పుడే భవిష్యత్తు నిర్మితమవుతుందని అన్నారు.

గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు భారతదేశంలో తొలిసారిగా హైదరాబాద్‌లో విజయవంతంగా నిర్వహించిన ఫార్ములా ఈ-రేస్ నిర్వహణ గురించి ప్రస్తావించారు. తాము నిర్వహించిన ఫార్ములా ఈ-రేసు కేవలం ఒక క్రీడా కార్యక్రమం కాదని, ఆవిష్కరణలు, క్లీన్ మొబిలిటీ, అత్యాధునిక సాంకేతికతకు తెలంగాణ కేంద్రంగా ప్రపంచ వేదికపై అడుగు పెట్టిందనడానికి ప్రతీక అని కేటీఆర్ అన్నారు.


More Telugu News