కరూర్ తొక్కిసలాట.. ఇళ్ల వద్ద కాకుండా ప్రత్యేక వేదికలో 41 కుటుంబాలను కలవనున్న విజయ్

  • అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రత ఏర్పాటు చేయాలని టీవీకే విజ్ఞప్తి
  • బాధిత కుటుంబాలకు మాత్రమే వేదిక వద్దకు ప్రవేశం ఉంటుందన్న పోలీసులు
  • పరిమిత సంఖ్యలో మాత్రమే మీడియాను అనుమతిస్తామన్న పోలీసులు
తమిళనాడులోని కరూర్ ప్రచార ర్యాలీలో జరిగిన తొక్కిసలాట దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన 41 మంది కుటుంబాలను ప్రముఖ సినీ నటుడు, టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ ప్రత్యేక వేదికలో కలవనున్నారు. కరూర్‌లో జరిగిన తొక్కిసలాటలో 41 మంది మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. మృతి చెందిన వారి కుటుంబాలను పరామర్శించాలని విజయ్ నిర్ణయించారు. బాధిత కుటుంబాలను వారి ఇళ్ల వద్ద కాకుండా, ఒక ప్రత్యేక వేదికలో కలవాలని ఆయన నిర్ణయించారు.

ఈ నెల 17న విజయ్ వారిని ఒక ప్రత్యేక వేదిక ద్వారా పరామర్శించనున్నారని అధికారులు తెలిపారు. వేదికకు సంబంధించిన వివరాలు ఇంకా వెల్లడి కావాల్సి ఉంది.

విజయ్ బాధితులను కలిసే సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ భద్రతను ఏర్పాటు చేయాలని టీవీకే పార్టీ విజ్ఞప్తి చేసింది. అందుకు అనుగుణంగా తగిన ఏర్పాట్లు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. కరూర్‌లోని వేదిక నుంచి ఒక కిలోమీటరు మేర ప్రజలు ఎవరూ రాకుండా చర్యలు తీసుకోవాలని పార్టీ వర్గాలు కోరాయి. కేవలం బాధిత కుటుంబాలకు మాత్రమే వేదిక వద్దకు ప్రవేశం ఉంటుందని వారు స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమానికి పరిమిత సంఖ్యలో మాత్రమే మీడియాను అనుమతిస్తామని పోలీసులు స్పష్టం చేశారు. తిరుచ్చి విమానాశ్రయం నుంచి కరూర్‌లోని సమావేశ వేదిక వద్దకు విజయ్ చేరుకునే వరకు దారిలో ఎక్కడా జనం గుమికూడకుండా విమానాశ్రయ, ట్రాఫిక్ అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు వెల్లడించారు.


More Telugu News