గిల్ అజేయ శతకం.. 518 పరుగుల వద్ద భారత్ ఇన్నింగ్స్ డిక్లేర్

  • వెస్టిండీస్‌పై భారత్ భారీ స్కోరు 518/5 (డిక్లేర్)
  • కెప్టెన్‌గా సొంతగడ్డపై తొలి సెంచరీ కొట్టిన గిల్ (129*)
  • 175 పరుగులతో అదరగొట్టిన యశస్వి జైస్వాల్
  • దురదృష్టవశాత్తు రనౌట్‌గా వెనుదిరిగిన వైనం
  • విండీస్ బౌలర్లలో వారికన్‌కు మూడు వికెట్లు
వెస్టిండీస్‌తో ఢిల్లీ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో భారత జట్టు పటిష్ట స్థితిలో నిలిచింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అజేయ శతకం(129) తో రాణించడంతో టీమిండియా తన తొలి ఇన్నింగ్స్‌ను రెండో రోజు ఆటలో 518/5 పరుగుల భారీ స్కోరు వద్ద డిక్లేర్ చేసింది.

అంతకుముందు, రెండో రోజు ఆట ప్రారంభమైన కాసేపటికే భారత్‌కు ఎదురుదెబ్బ తగిలింది. అద్భుతమైన ఫామ్‌లో ఉన్న ఓపెనర్ యశస్వి జైస్వాల్ (175) దురదృష్టవశాత్తు రనౌట్‌గా వెనుదిరిగాడు. గిల్‌తో సమన్వయ లోపం కారణంగా జైస్వాల్ తన డబుల్ సెంచరీకి చేరువలో వికెట్ చేజార్చుకున్నాడు.

జైస్వాల్ ఔటైన తర్వాత క్రీజులో పాతుకుపోయిన కెప్టెన్ గిల్ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఈ క్రమంలో తన టెస్ట్ కెరీర్‌లో 10వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కెప్టెన్‌గా భారత గడ్డపై అతనికి ఇదే తొలి శతకం కావడం విశేషం. వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ (44)తో కలిసి గిల్ 102 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఆల్‌రౌండర్ నితీశ్ రెడ్డి (43) కూడా తన వంతు సహకారం అందించడంతో భారత స్కోరు 500 పరుగులు దాటింది.

వెస్టిండీస్ బౌలర్లలో స్పిన్నర్ జోమెల్ వారికన్ మూడు వికెట్లతో రాణించగా, కెప్టెన్ రోస్టన్ చేజ్ ఒక వికెట్ పడగొట్టాడు. భారీ స్కోరు సాధించిన టీమిండియా, ఈ మ్యాచ్‌పై పూర్తి పట్టు సాధించింది.




More Telugu News