భగ్గుమన్న బీసీ సంఘాలు.. 13న హైవేల దిగ్బంధం, 14న తెలంగాణ బంద్

  • స్థానిక సంస్థల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే
  • నిరసనగా 14న రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చిన ఆర్. కృష్ణయ్య
  • 13న జాతీయ రహదారుల దిగ్బంధానికి జాజుల శ్రీనివాస్ పిలుపు
  • హైకోర్టు తీర్పు ఏకపక్షమంటూ బీసీ నేతల తీవ్ర విమర్శ
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు కేటాయించిన 42 శాతం రిజర్వేషన్లపై హైకోర్టు స్టే విధించడాన్ని నిరసిస్తూ బీసీ సంఘాలు ఆందోళనలకు పిలుపునిచ్చాయి. 14న రాష్ట్రవ్యాప్త బంద్‌ నిర్వహించనున్నట్టు ఎంపీ ఆర్. కృష్ణయ్య ప్రకటించగా, 13న జాతీయ రహదారులను దిగ్బంధం చేయనున్నట్లు జాజుల శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. హైకోర్టు నిర్ణయంపై బీసీ సంఘాల నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

నిన్న హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో 22 బీసీ సంఘాలతో జరిగిన సమావేశంలో ఆర్. కృష్ణయ్య ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యాక హైకోర్టు ఏకపక్షంగా స్టే ఇవ్వడం దారుణమని ఆయన విమర్శించారు. బీసీ రిజర్వేషన్ల సాధన ఇప్పుడు ఒక ప్రజా ఉద్యమంగా మారిందని, మిలియన్ మార్చ్ తరహాలో శాంతియుతంగా ఉద్యమిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ బంద్‌కు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వాలని కోరారు.

ఈ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీ మధుసూదనాచారి మాట్లాడుతూ "బీసీలు బిచ్చగాళ్లు కాదు, వాటాదారులు అనే వాస్తవాన్ని పాలకులు గ్రహించాలి. రాజ్యాధికారంతోనే బీసీల సమస్యలు పరిష్కారమవుతాయి" అని అన్నారు. 42 శాతం రిజర్వేషన్లు అమలు చేశాకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ డిమాండ్ చేశారు.

మరోవైపు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ హైకోర్టు స్టేకు నిరసనగా 13న రాష్ట్రవ్యాప్తంగా జాతీయ రహదారులను దిగ్బంధం చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. నేటి మధ్యాహ్నం బంజారాహిల్స్‌లోని కళింగభవన్‌లో అఖిలపక్ష పార్టీలు, వివిధ సంఘాల నేతలు, మేధావులతో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు.


More Telugu News