నాలుగు రోజుల మిస్సింగ్.. దుబాయ్ ఎయిర్‌పోర్టులో కుప్పకూలిన నిజామాబాద్ వాసి!

  • విమానాశ్రయంలో అపస్మారక స్థితిలో కుప్పకూలిన గల్ఫ్ కార్మికుడు
  • నాలుగు రోజులుగా ఆచూకీ తెలియక కుటుంబ సభ్యుల ఆందోళన
  • సీఎం ప్రవాసీ ప్రజావాణి చొరవతో దుబాయ్ ఆసుపత్రిలో గుర్తింపు
  • తన భర్తను ఇండియాకు రప్పించాలని ముఖ్యమంత్రికి భార్య విజ్ఞప్తి
  • బాధితుడికి అండగా దుబాయ్‌లోని నిజామాబాద్ వాసులు
ఉపాధి కోసం గల్ఫ్ దేశానికి బయలుదేరిన ఓ తెలంగాణ కార్మికుడి ప్రయాణం ఊహించని రీతిలో మధ్యలోనే ఆగిపోయింది. నాలుగు రోజుల పాటు ఆయన ఆచూకీ తెలియకపోవడంతో తీవ్ర ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు, చివరకు ఆయన దుబాయ్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిసి ఊపిరి పీల్చుకున్నారు. మెరుగైన వైద్యం కోసం తమ వారిని స్వదేశానికి రప్పించాలని ఆ కుటుంబం ఇప్పుడు ప్రభుత్వాన్ని వేడుకుంటోంది.

నిజామాబాద్ జిల్లా మహబూబ్‌బాగ్‌కు చెందిన సయ్యద్ బాబా (38) సౌదీ అరేబియాలోని అభా నగరానికి వెళ్లేందుకు ఈ నెల 3వ తేదీన ముంబైలో విమానం ఎక్కాడు. ప్రయాణంలో భాగంగా దుబాయ్ విమానాశ్రయంలో విరామ సమయంలో ఆయన అకస్మాత్తుగా అస్వస్థతకు గురై అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. వెంటనే స్పందించిన విమానాశ్రయ సిబ్బంది మానవతా దృక్పథంతో ఆయనను అక్కడి రషీద్ ఆసుపత్రికి తరలించారు.

మరోవైపు, సయ్యద్ బాబా గమ్యస్థానానికి చేరుకోకపోవడం, ఆయన ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. నాలుగు రోజులుగా ఎలాంటి సమాచారం లేకపోవడంతో హైదరాబాద్‌లోని సీఎం ప్రవాసీ ప్రజావాణిని ఆశ్రయించారు. వారి ఫిర్యాదు మేరకు ఎన్నారై అడ్వైజరీ కమిటీ వైస్ చైర్మన్ మంద భీంరెడ్డి, ప్రవాసీ ప్రజావాణి బృందం వెంటనే రంగంలోకి దిగి గాలించగా, సయ్యద్ బాబా దుబాయ్‌లోని రషీద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు గుర్తించారు.

సయ్యద్ బాబా భార్య సమీనా బేగం, సోదరుడు చోటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. మెరుగైన వైద్యం కోసం అతనిని ఇండియాకు రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని వారు కోరారు. దుబాయ్‌లో నివసిస్తున్న నిజామాబాద్ వాసులు నయీమ్, కొట్టాల సత్యం నారాగౌడ్ ప్రస్తుతం బాబా బాగోగులు చూసుకుంటున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఇమిగ్రెంట్స్ వెల్ఫేర్ ఫోరం ప్రధాన కార్యదర్శి బీఎల్ సురేంద్రనాథ్ ఈ విషయంలో వారికి సహాయం చేస్తున్నారు. 


More Telugu News