ట్రంప్‌కు దక్కని నోబెల్ శాంతి బహుమతి... నోబెల్ కమిటీ ఏం చెప్పిందంటే..!

  • వెనిజులా ప్రజాస్వామ్య ఉద్యమకారిణి మరియా కొరినా మచాడోకు పురస్కారం
  • యుద్ధాలు ఆపానంటూ ట్రంప్ చేసిన ప్రచారానికి దక్కని గుర్తింపు
  • ప్రచారాలు కాదు, చిత్తశుద్ధే ముఖ్యమన్న నోబెల్ కమిటీ
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎంతోకాలంగా ఆశిస్తున్న నోబెల్ శాంతి బహుమతి ఈసారి కూడా ఆయనకు అందని ద్రాక్షగానే మిగిలింది. భారత్-పాకిస్థాన్ మధ్య యుద్ధాన్ని తానే ఆపానంటూ చేసిన ప్రచారంతో సహా, అనేక వివాదాస్పద వాదనలతో ఈ పురస్కారం కోసం తీవ్రంగా ప్రయత్నించిన ట్రంప్‌కు నిరాశే ఎదురైంది. 2025 సంవత్సరానికి గాను ప్రతిష్ఠాత్మక నోబెల్ శాంతి బహుమతిని వెనిజులాకు చెందిన విపక్ష నేత, ప్రజాస్వామ్య ఉద్యమకారిణి మరియా కొరినా మచాడోకు అందిస్తున్నట్లు నోబెల్ కమిటీ ప్రకటించింది.

నోబెల్ బహుమతి ప్రకటన అనంతరం కమిటీ ఛైర్మన్ జార్గెన్ వాట్నే ఫ్రైడ్నెస్ మాట్లాడుతూ, తమ నిర్ణయం కేవలం గ్రహీతల ధైర్యసాహసాలు, చిత్తశుద్ధిపైనే ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు. "ప్రతి ఏటా మాకు వేలాది సిఫార్సు లేఖలు వస్తాయి, మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారాలు జరుగుతాయి. కానీ మా నిర్ణయాలు ఆల్ఫ్రెడ్ నోబెల్ సంకల్పానికి అనుగుణంగానే ఉంటాయి" అని ఆయన తెలిపారు. ఈ వ్యాఖ్యలు పరోక్షంగా ట్రంప్ ప్రచార సరళిని ఉద్దేశించినవేనని విశ్లేషకులు భావిస్తున్నారు. వెనిజులాలో ప్రజాస్వామ్యం కోసం పోరాడుతున్న కీలకమైన, ఐక్యతా శక్తిగా మరియా కొరినాను కమిటీ ప్రశంసించింది.

నోబెల్ పురస్కారం కోసం ట్రంప్, వైట్‌హౌస్ పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించాయి. గత నెల ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో కూడా ట్రంప్ తన శాంతి యత్నాల గురించి గొప్పగా చెప్పుకున్నారు. భారత్-పాకిస్థాన్ మధ్య మే నెలలో ఉద్రిక్తతలను తానే చల్లార్చానని ఆయన బలంగా వాదించారు. అయితే, పాకిస్థాన్ ప్రత్యక్ష అభ్యర్థన మేరకే కాల్పుల విరమణ జరిగిందని, ఇందులో ట్రంప్ పాత్ర ఏమీ లేదని భారత్ అప్పట్లోనే తీవ్రంగా ఖండించింది.

దీనితో పాటు ఇజ్రాయెల్-ఇరాన్, రువాండా-కాంగో, సెర్బియా-కొసోవో సహా మొత్తం ఏడు యుద్ధాలను తానే పరిష్కరించినట్లు ట్రంప్ చెప్పుకున్నారు. వాస్తవానికి వీటిలో కొన్ని పూర్తిస్థాయి యుద్ధాలు కాకపోగా, మరికొన్నింటిలో ఉద్రిక్తతలు ఇప్పటికీ కొనసాగుతున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. నోబెల్ బహుమతిపై ట్రంప్‌కు ఉన్న ఆసక్తి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాకు గతంలో ఈ పురస్కారం వచ్చినప్పుడు, ఏమీ చేయకుండానే ఆయనకు బహుమతి ఇచ్చారంటూ ట్రంప్ తీవ్రంగా విమర్శించిన విషయం తెలిసిందే. 


More Telugu News