ఎద్దులతో విద్యుత్ ఉత్పత్తి... నెల్లూరు ప్రాజెక్ట్‌పై సీఎం చంద్రబాబు ఆశ్చర్యం!

  • నెల్లూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన
  • విశ్వసముద్ర గ్రూప్ ప్రాజెక్టులను ప్రారంభించిన సీఎం 
  • 'నందగోకులం - సేవ్ ది బుల్' కార్యక్రమానికి శ్రీకారం
  •  నందగోకులం లైఫ్ స్కూల్‌కు ప్రారంభోత్సవం
  • ధాన్యం నూకలతో ఇథనాల్ ఉత్పత్తి చేసే బయో ఎనర్జీ ప్లాంట్‌కు శంకుస్థాపన
  • సమాజం వల్ల ఎదిగిన వారు తిరిగి సమాజానికి సేవ చేయాలని పిలుపునిచ్చిన చంద్రబాబు
సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతున్న ఈ రోజుల్లో ఎద్దుల శక్తితో విద్యుత్తును ఉత్పత్తి చేయడం తనను ఎంతగానో ఆశ్చర్యపరిచిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. బొగ్గు, నీరు, సౌర, పవన విద్యుత్ గురించి విన్నాం కానీ, ఎద్దులతో విద్యుత్ ఉత్పత్తి చేయడం దేశంలోనే ఇది మొదటిసారని ఆయన ప్రశంసించారు. శుక్రవారం నెల్లూరు జిల్లాలో పర్యటించిన ఆయన, విశ్వసముద్ర గ్రూప్ చేపట్టిన పలు వినూత్న ప్రాజెక్టులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం మాట్లాడారు.

విశ్వసముద్ర గ్రూప్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 'నందగోకులం - సేవ్ ది బుల్' కార్యక్రమం చాలా విశిష్టమైనదని చంద్రబాబు కొనియాడారు. ఒకప్పుడు మన రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచిన ఒంగోలు జాతి గిత్తలు ఇప్పుడు అంతరించిపోయే దశకు చేరుకోవడం బాధాకరమని అన్నారు. "మన దగ్గర కనుమరుగవుతున్న ఒంగోలు జాతిని బ్రెజిల్ దేశం పరిరక్షించి, ప్రపంచానికి అందిస్తుండటం మనం ఆలోచించాల్సిన విషయం. ఈ నేపథ్యంలో ఒంగోలు జాతి పరిరక్షణకు 'సేవ్ ది బుల్' నినాదంతో ముందుకు రావడం అభినందనీయం" అని చంద్రబాబు పేర్కొన్నారు. ఎద్దుల శక్తితో 5 యూనిట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తూ 'పవర్ ఆఫ్ బుల్స్' అంటే ఏమిటో చాటిచెప్పారని ఆయన హర్షం వ్యక్తం చేశారు.

ఈ పర్యటనలో భాగంగా, పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన నందగోకులం లైఫ్ స్కూల్‌ను చంద్రబాబు ప్రారంభించారు. సాధారణ విద్యార్థులను అసాధారణ వ్యక్తులుగా తీర్చిదిద్దే ఈ ప్రయత్నం గొప్పదని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, "సమాజం మనకు ఎంతో ఇస్తుంది. సమాజం సహకారంతో పైకి వచ్చిన ప్రతి ఒక్కరూ తిరిగి సమాజానికి సేవ చేయాలి. డబ్బు ఇవ్వడం మాత్రమే కాదు, ఇలాంటి మంచి పనుల ద్వారా భావితరాలకు ఉత్తమ పౌరులను అందించాలి" అని పిలుపునిచ్చారు. చింతా శశిధర్ ఫౌండేషన్ పీ4 మోడల్‌లో ఈ స్కూల్‌ను అద్భుతంగా నడుపుతోందని ప్రశంసించారు.

అనంతరం, రైతుల ఆదాయాన్ని పెంచే లక్ష్యంతో ఏర్పాటు చేస్తున్న విశ్వసముద్ర బయో ఎనర్జీ ఇథనాల్ ప్లాంట్‌కు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. సుమారు 15,000 టన్నుల ధాన్యం నూకలతో ఇథనాల్ తయారు చేయడం వల్ల రైతులకు అదనపు ఆదాయం లభిస్తుందని, పర్యావరణ పరిరక్షణకు ఇది దోహదపడుతుందని వివరించారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఉందని, దగదర్తిలో విమానాశ్రయం, కృష్ణపట్నం పోర్టు, జాతీయ రహదారి, రైల్వే కనెక్టివిటీ వంటి మౌలిక సదుపాయాలు అభివృద్ధికి బాటలు వేస్తాయని భరోసా ఇచ్చారు. 

"2047 నాటికి భారతదేశం ప్రపంచంలోనే అగ్రగామిగా నిలుస్తుంది. అందులో ఆంధ్రప్రదేశ్‌ను నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దడమే మా లక్ష్యం. విశాఖలో రూ.87 వేల కోట్లతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్ రాబోతోంది. పేదరికాన్ని నిర్మూలించే బాధ్యతను అందరూ తీసుకోవాలి" అని చంద్రబాబు అన్నారు.


More Telugu News