తగ్గేదేలే... హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఇళ్ల రిజిస్ట్రేషన్లు

  • సెప్టెంబర్‌లో రూ. 4,804 కోట్లకు చేరిన లావాదేవీల విలువ
  • గతేడాదితో పోలిస్తే 70 శాతం పెరిగిన రిజిస్ట్రేషన్ల విలువ
  • కోటి రూపాయలు పైబడిన ఇళ్ల అమ్మకాల్లో 151 శాతం వృద్ధి
  • ఖరీదైన ఇళ్ల కొనుగోళ్లకే నగరవాసుల ఆసక్తి
  • రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోనే అత్యధిక రిజిస్ట్రేషన్లు
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ కొత్త రికార్డులను సృష్టిస్తోంది. సాధారణంగా అమ్మకాలు నెమ్మదిగా సాగే పితృపక్షాల సమయంలోనూ రిజిస్ట్రేషన్ల జోరు తగ్గలేదు. సెప్టెంబర్ నెలలో నగరంలో జరిగిన గృహ రిజిస్ట్రేషన్ల విలువ ఏకంగా రూ. 4,804 కోట్లకు చేరింది. గతేడాది ఇదే సమయంతో పోలిస్తే ఇది 70 శాతం అధికమని ప్రముఖ ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ నైట్ ఫ్రాంక్ ఇండియా శుక్రవారం విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది.

నివేదిక ప్రకారం, సెప్టెంబర్‌లో మొత్తం నివాస గృహాల రిజిస్ట్రేషన్లు గతేడాదితో పోలిస్తే 35 శాతం పెరిగాయి. ముఖ్యంగా, ఖరీదైన, విలాసవంతమైన ఇళ్ల కొనుగోలుకు నగరవాసులు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారని స్పష్టమైంది. కోటి రూపాయల కంటే ఎక్కువ విలువైన ఇళ్ల రిజిస్ట్రేషన్లు ఏకంగా 151 శాతం పెరిగాయి. మొత్తం లావాదేవీల విలువలో ఈ ప్రీమియం ఇళ్ల వాటానే 53 శాతంగా ఉండటం గమనార్హం. అదేవిధంగా, మొత్తం రిజిస్ట్రేషన్లలో వీటి వాటా 22 శాతానికి చేరింది.

ఈ సందర్భంగా నైట్ ఫ్రాంక్ ఇండియా ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శిశిర్ బైజల్ మాట్లాడుతూ, "హైదరాబాద్ రెసిడెన్షియల్ మార్కెట్ తన వృద్ధిని నిలకడగా కొనసాగిస్తోంది. పితృపక్షాల వంటి ఆఫ్ సీజన్ లో కూడా రిజిస్ట్రేషన్లు భారీగా పెరగడం మార్కెట్ బలాన్ని సూచిస్తోంది. కొనుగోలుదారులు పెద్ద, ఖరీదైన ఇళ్ల వైపు ఆసక్తి చూపుతున్నారనడానికి ఈ గణాంకాలే నిదర్శనం" అని తెలిపారు.

రిజిస్ట్రేషన్ అయిన ఆస్తులలో అత్యధికంగా 67 శాతం ఇళ్లు 1,000 నుంచి 2,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్నాయి. 2,000 చదరపు అడుగుల కంటే పెద్ద ఇళ్ల వాటా కూడా గతేడాది 13 శాతం నుంచి ఈసారి 15 శాతానికి పెరిగింది. హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల పరిధిలో ఈ రిజిస్ట్రేషన్లు జరిగాయి. అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో 45 శాతం, మేడ్చల్-మల్కాజిగిరిలో 40 శాతం, హైదరాబాద్ జిల్లాలో 14 శాతం రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయని నివేదిక వివరించింది.


More Telugu News