బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు కనీసం బాధ కూడా లేదు: కూనంనేని సాంబశివరావు

  • బీసీ రిజర్వేషన్ల అంశంపై హైకోర్టు స్టే ఇవ్వడంతో సంబరాలు చేసుకుంటున్నారని విమర్శ
  • బీసీ బిల్లుకు తమ పార్టీ మద్దతిచ్చిందన్న కూనంనేని సాంబశివరావు
  • రాజ్యాంగాన్ని సవరించే అవకాశం కేంద్రానికి ఉన్నా చేయడం లేదని వ్యాఖ్య
బీసీ రిజర్వేషన్ల అంశంపై హైకోర్టు స్టే విధించినందుకు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు కనీసం బాధ కూడా లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, బీసీ రిజర్వేషన్ల అంశంపై హైకోర్టు స్టే ఇవ్వడంతో బీజేపీ, బీఆర్ఎస్ నేతలు సంబరాలు చేసుకుంటున్నారని విమర్శించారు.

వారి తీరు ప్రభుత్వంపై ద్వేషమా లేక బీసీలపై ప్రేమ లేదో అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. బీసీ రిజర్వేషన్ల బిల్లుపై అసెంబ్లీలో మద్దతు తెలిపి ఇప్పుడు సన్నాయి నొక్కులు ఎందుకని ప్రశ్నించారు. బీసీ బిల్లుకు తమ పార్టీ మద్దతు తెలిపిందని, కేసులో కూడా ఇంప్లీడ్ అయ్యామని చెప్పారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఎందుకు కాలేదని ఆయన నిలదీశారు.

రిజర్వేషన్లు 50 శాతం దాటొద్దని సుప్రీంకోర్టు తీర్పు ఉందని, అందుకే 9వ షెడ్యూల్‌లో పెట్టడం ద్వారా తమిళనాడులో ప్రత్యేక పరిస్థితుల్లో అంతకంటే ఎక్కువ రిజర్వేషన్లు అమలు చేశారని చెప్పారు. రాజ్యాంగాన్ని సవరించే అవకాశం కేంద్రానికి ఉన్నప్పటికీ చేయడం లేదని విమర్శించారు. బీసీ రిజర్వేషన్ల అంశం మొత్తం బీజేపీ చేతిలోనే ఉందని ఆయన అన్నారు.

బీసీ రిజర్వేషన్ల అంశంలో బీజేపీయే దోషి అని ఆయన వ్యాఖ్యానించారు. ఆ పార్టీకి బీఆర్ఎస్ మద్దతు ఇస్తోందని ఆరోపించారు. రిజర్వేషన్ అంశంపై అవసరమైతే ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేయాలని కూనంనేని సూచించారు. ఈ బిల్లు ఆమోదం పొందితే రిజర్వేషన్ల విషయంలో దేశవ్యాప్తంగా ముందడుగు పడుతుందని అన్నారు.


More Telugu News