నన్ను తొక్కితే.. నేను ఎక్కుతా: కాంగ్రెస్ నాయకత్వంపై అంజన్ కుమార్ ఫైర్

  • జూబ్లీహిల్స్ టికెట్‌పై కాంగ్రెస్‌లో ముదిరిన వివాదం
  • తీవ్ర అసంతృప్తితో వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్
  • అంజన్‌ను బుజ్జగించేందుకు రంగంలోకి దిగిన మంత్రులు
  • సీఎం రేవంత్‌ను ఉద్దేశించి పరోక్ష విమర్శలు
  • కార్యకర్తలతో చర్చించాకే తదుపరి నిర్ణయమని వెల్లడి
జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక కాంగ్రెస్ పార్టీలో తీవ్ర కలకలం రేపింది. టికెట్ కేటాయింపు వ్యవహారంపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ తీవ్ర అసంతృప్తితో భగ్గుమన్నారు. ఆయన అలకబూనడంతో పార్టీ నాయకత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్‌తో పాటు రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ స్వయంగా ఆయన నివాసానికి వెళ్లి బుజ్జగించే ప్రయత్నం చేశారు.

ఈ సందర్భంగా అంజన్ కుమార్ యాదవ్ పార్టీ నాయకుల ఎదుట తన ఆవేదనను, ఆగ్రహాన్ని వెళ్లగక్కారు. 40 ఏళ్లుగా పార్టీకి సేవ చేస్తున్న తనను కనీసం సంప్రదించకుండా అభ్యర్థిని ఎలా ఖరారు చేస్తారని నిలదీశారు. ఇది తనను ఘోరంగా అవమానించడమేనని ఆయన మండిపడ్డారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు మాత్రమే స్థానిక, స్థానికేతర అంశం ఎందుకు తెరపైకి వచ్చిందని ప్రశ్నించారు. గతంలో కామారెడ్డి, మల్కాజ్‌గిరిలో పోటీ చేసినప్పుడు ఈ విషయం గుర్తుకు రాలేదా? అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి పరోక్షంగా చురకలు అంటించారు.

కష్టకాలంలో కూడా పార్టీని అంటిపెట్టుకుని పనిచేశానని, అయినా తనకు తగిన గౌరవం దక్కలేదని అంజన్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. "వాళ్లు మమ్మల్ని తొక్కుకుంటూ పోతే, మేం ఎక్కుకుంటూ పోతాం" అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తనకు టికెట్ రాకుండా అడ్డుపడింది ఎవరో త్వరలోనే బయటపెడతానని అన్నారు. కనీసం నియోజకవర్గ కమిటీలో కూడా తనకు స్థానం కల్పించలేదని వాపోయారు. తన మద్దతుదారులు, కార్యకర్తలతో సమావేశమైన తర్వాత తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తానని ఆయన స్పష్టం చేశారు.


More Telugu News