బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు మళ్లీ భారీ వర్ష సూచన

  • బంగాళాఖాతంలో బలపడుతున్న ఉపరితల ఆవర్తనం
  • రేప‌టికి అల్పపీడనంగా మారే అవకాశం
  • వచ్చే వారం తెలంగాణలో మళ్లీ కుండపోత వర్షాలు
  • రాబోయే మూడు రోజులు పలు జిల్లాలకు వర్ష సూచన
  • ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలుల హెచ్చరిక
తెలంగాణలో వర్షాలు ఇప్పట్లో తగ్గుముఖం పట్టేలా లేవు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం బలపడి అల్పపీడనంగా మారనుండటంతో వచ్చే వారం రాష్ట్రంలో మళ్లీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది.

ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌ నుంచి గల్ఫ్‌ ఆఫ్‌ మన్నార్‌ వరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మీదుగా ఒక ద్రోణి కొనసాగుతోందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీనికి తోడు బంగాళాఖాతంలో ఉన్న ఉపరితల ఆవర్తనం మరింత బలపడి ఈ నెల 11 నాటికి అల్పపీడనంగా మారే సూచనలున్నాయని తెలిపింది. ఈ ప్రభావంతో రాష్ట్రంలో వచ్చేవారం కుండపోత వర్షాలు తప్పవని హెచ్చరించింది.

ఈ నేపథ్యంలో రాబోయే మూడు రోజులపాటు పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని అంచనా వేసింది. అలాగే శని, ఆదివారాల్లో భద్రాద్రి-కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది.

గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది. అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లిలో 9.15 సెం.మీ. వర్షం కురవగా, మల్కలపల్లిలో 7.55 సెం.మీ., నల్లగొండ జిల్లా తిప్పర్తిలో 6.78 సెం.మీ. వర్షపాతం రికార్డయినట్లు అధికారులు తెలిపారు. వర్షాకాలం ఆరంభంలో వర్షాలు తక్కువగా ఉన్నప్పటికీ, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో భారీ వర్షాలు కురిశాయని, ఆ ప్రభావం ఇప్పటికీ కొనసాగుతోందని వాతావరణ కేంద్రం తన ప్రకటనలో పేర్కొంది.


More Telugu News