జగన్ దుర్మార్గపు రాజకీయాలకు తెరలేపారు: కొల్లు రవీంద్ర

  • ఎవరు చనిపోయినా నకిలీ మద్యం అంటున్నారన్న కొల్లు రవీంద్ర
  • అసత్య ప్రచారం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరిక
  • సీఎం ఆదేశాలతో సమగ్ర విచారణకు ఆదేశించామని వెల్లడి
ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన నకిలీ మద్యం వ్యవహారంపై రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తీవ్రంగా స్పందించారు. ఈ అంశాన్ని అడ్డం పెట్టుకుని జగన్ దుర్మార్గపు రాజకీయాలకు తెరలేపారని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. ఎవరు, ఎలా మరణించినా దాన్ని నకిలీ మద్యానికి ముడిపెట్టి ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయాలని టెలీ కాన్ఫరెన్స్‌ల ద్వారా జగన్ తన పార్టీ శ్రేణులకు సూచిస్తున్నారని మంత్రి మండిపడ్డారు. ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

అన్నమయ్య జిల్లా ములకలచెరువులో ఈ నెల 3న నకిలీ మద్యం తయారీపై ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు నివేదిక ఇచ్చారని మంత్రి తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే అధికారులు దాడులు నిర్వహించి, నకిలీ మద్యం సరఫరా చేసే వ్యాన్‌లను గుర్తించారని చెప్పారు. ఈ దాడుల్లో 30 క్యాన్ల స్పిరిట్‌ను స్వాధీనం చేసుకున్నామని, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో సమగ్ర విచారణకు ఉత్తర్వులు జారీ చేశామని స్పష్టం చేశారు.

ఈ నకిలీ మద్యం దందా వెనుక ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంకు చెందిన అద్దేపల్లి జనార్దన్ రావు ప్రధాన సూత్రధారిగా ఉన్నారని కొల్లు రవీంద్ర వెల్లడించారు. ఇతనికి ఇబ్రహీంపట్నంలో మద్యం దుకాణాలు ఉన్నాయని, రాక్ స్టార్, ఆంధ్ర వైన్స్ అనే రెండు కంపెనీల పేర్లతో ఈ వ్యవహారం నడిపినట్లు గుర్తించామన్నారు. ఈ కేసులో తెనాలికి చెందిన కొడాలి శ్రీనివాస్‌తో పాటు తమిళనాడు, ఒడిశా రాష్ట్రాలకు చెందిన మరికొందరి ప్రమేయం కూడా ఉందని తెలిపారు.

ఈ ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న జయచంద్రారెడ్డిని ఇప్పటికే పార్టీ నుంచి సస్పెండ్ చేశామని మంత్రి గుర్తుచేశారు. గత ప్రభుత్వ హయాంలో డిస్టిలరీలను కబ్జా చేశారని విమర్శించారు. ప్రస్తుతం ఎక్సైజ్ శాఖ పకడ్బందీగా పనిచేస్తోందని, రాష్ట్రంలో అన్ని బ్రాండ్ల మద్యం అందుబాటులో ఉందని ఆయన స్పష్టం చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత 600 మంది చనిపోయారని చెబుతూ జగన్ తన రాజకీయ జీవితాన్ని శవయాత్రలతోనే ప్రారంభించారని కొల్లు రవీంద్ర ఎద్దేవా చేశారు. 


More Telugu News