శిథిలావస్థకు చేరిన గ్రంథాలయానికి సినీ, రాజకీయ సెలబ్రిటీలు?

  • నిత్యం వస్తున్నారంటూ లైబ్రరీ రిజిస్టర్ లో సంతకాలు..
  • రిజిస్టర్ చూసి షాక్ అయిన మంత్రి.. విచారణకు ఆదేశం
  • చిరంజీవి, జూ.ఎన్టీఆర్‌ లతో పాటు పరిటాల రవి పేర్లు కూడా..
షూటింగ్ లు, మీటింగ్ లతో నిత్యం బిజీబిజీగా గడిపే సినీ, రాజకీయ ప్రముఖులు ఓ చిన్న ఊరులో ఉన్న లైబ్రరీకి నిత్యం వెళతారంటే ఎవరైనా నమ్ముతారా..? ఆ లైబ్రేరియన్‌ మాత్రం నమ్మేశాడు. రిజిస్టర్ లో సినీ ప్రముఖుల పేర్లతో సంతకాలు పెడుతున్నా తనకేం పట్టనట్టు ఊరుకున్నాడు. ఇందులో ఇంకో విశేషం కూడా ఉందండోయ్.. బతికున్న వారే కాదు మరణించిన నేతలూ ఈ లైబ్రరీకి నిత్యం వచ్చి వెళుతున్నారట. ఇంతకీ ఈ లైబ్రరీ ఎక్కడ ఉందంటే.. అనంతపురం జిల్లాలోని ఉరవకొండలో ఉంది.

వివరాల్లోకి వెళితే..
ఉరవకొండలోని ప్రభుత్వ గ్రంథాలయం శిథిలావస్థకు చేరిన విషయం మంత్రి పయ్యావుల కేశవ్ దృష్టికి వెళ్లింది. దీంతో వెంటనే స్పందించిన మంత్రి.. కొత్త భవనం నిర్మాణానికి ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో పలు వివరాలు ఆరా తీశారు. లైబ్రరీలో ఉన్న పుస్తకాలు, సందర్శకుల వివరాలతో రావాలని గ్రంథాలయ అధికారి ప్రతాపరెడ్డిని ఆదేశించారు. సంబంధిత వివరాలు ఉన్న రిజిస్టర్లను ప్రతాపరెడ్డి మంత్రి పయ్యావుల కేశవ్ కు అందజేశారు. పాఠకుల హాజరు పుస్తకాన్ని పరిశీలించిన మంత్రి షాక్ అయ్యారు.

అందులో దివంగత నేత పరిటాల రవి, మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి, సినీ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, చిరంజీవి సహా పలువురు ప్రముఖుల సంతకాలు ఉండడంతో మంత్రి విస్తుపోయారు. అనంతరం అధికారి అలసత్వంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రముఖుల పేర్లతో ఉన్న సంతకాలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపి కేసు నమోదు చేయాలని సీఐ మహానందినిని మంత్రి ఆదేశించారు.



More Telugu News