ముంబైలో రేసింగ్ బీభత్సం.. నుజ్జునుజ్జయిన పోర్షే కారు!

  • ముంబై వెస్టర్న్ ఎక్స్‌ప్రెస్ హైవేపై అర్ధరాత్రి ఘోర ప్రమాదం
  • బీఎండబ్ల్యూ కారుతో పోర్షే రేసింగ్‌కు దిగినట్టు ప్రత్యక్ష సాక్షుల కథనం
  • గంటకు 150 కి.మీ. వేగంతో ప్రయాణిస్తూ అదుపుతప్పిన కారు
  • డివైడర్‌ను బలంగా ఢీకొట్టడంతో నుజ్జునుజ్జయిన పోర్షే
  • ప్రమాదంలో డ్రైవర్‌కు తీవ్ర గాయాలు, ఆసుపత్రికి తరలింపు
ముంబై మహానగరంలో లగ్జరీ కార్ల రేసింగ్ బీభత్సం సృష్టించింది. అత్యంత వేగంతో దూసుకెళ్లిన ఓ పోర్షే కారు అదుపుతప్పి డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు నుజ్జునుజ్జు కాగా, డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. నగరంలోని వెస్టర్న్ ఎక్స్‌ప్రెస్ హైవేపై జోగేశ్వరి మెట్రో స్టేషన్ సమీపంలో గత అర్ధరాత్రి సుమారు 2 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

ఓ పోర్షే కారు, మరో బీఎండబ్ల్యూ కారు హైవేపై రేసింగ్‌కు దిగినట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. గంటకు సుమారు 150 కిలోమీటర్ల వేగంతో ఈ రెండు కార్లు పోటీ పడుతుండగా, ఉన్నట్టుండి పోర్షే కారు డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. దీంతో కారు నేరుగా వెళ్లి రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు ఆ లగ్జరీ కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది.

"రెండు కార్లు ఒకదానితో ఒకటి పోటీ పడుతూ వేగంగా వెళ్లాయి. క్షణాల్లోనే పోర్షే కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది" అని ప్రత్యక్ష సాక్షి ఒకరు మీడియాకు తెలిపారు. ప్రమాద సమయంలో కారులో డ్రైవర్‌తో పాటు మరొకరు ఉన్నట్టు తెలిసింది. కారులోని భద్రతా ఎయిర్‌బ్యాగ్‌లు తెరుచుకున్నప్పటికీ, డ్రైవర్‌కు తీవ్రమైన గాయాలయ్యాయి.

ప్రమాదాన్ని గమనించిన స్థానికులు, పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రుడిని హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇది కేవలం అతివేగం వల్ల జరిగిన ప్రమాదమా? లేక నిజంగానే రేసింగ్ జరిగిందా? అనే కోణంలో విచారణ జరుపుతున్నట్టు అధికారులు వెల్లడించారు.


More Telugu News