గోదావరి ఎక్స్ ప్రెస్‌లో ప్రయాణికుడి మృతి

  • ట్రైన్ మరుగుదొడ్డిలో గుండెపోటుతో మారేపల్లి సుజిత్ మృతి
  • హైదరాబాద్ నుంచి విశాఖ వెళుతున్న గోదావరి ఎక్స్‌ప్రెస్‌లో ఘటన
  • కాజీపేట వద్ద మృతుడి బంధువుల ఆందోళన
హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్తున్న గోదావరి ఎక్స్‌ప్రెస్‌ రైలులో ఒక ప్రయాణికుడు మృతి చెందడంతో ఉద్రిక్తత నెలకొంది.

వివరాల్లోకి వెళితే, కాజీపేట సిద్ధార్థనగర్‌కు చెందిన మారెపల్లి సుజిత్ (45) హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. బుధవారం సాయంత్రం విధి నిర్వహణ ముగించుకుని సుజిత్ గోదావరి ఎక్స్‌ప్రెస్‌లో కాజీపేటకు బయలుదేరారు.

రైలు జనగామ సమీపంలో ఉన్నప్పుడు ఏసీ బోగీలోని మరుగుదొడ్డికి వెళ్లిన ఆయన ఎంతసేపటికీ తిరిగి రాకపోవడంతో అనుమానం వచ్చిన ప్రయాణికులు తలుపు తెరిచి చూడగా, ఆయన అక్కడ అపస్మారక స్థితిలో పడిపోయి ఉన్నారు.

వెంటనే ప్రయాణికులు టీసీకి, హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేసినా ఎటువంటి స్పందన రాలేదని వారు తెలిపారు. రైలు కాజీపేట రైల్వే స్టేషన్‌కు చేరుకునే సమయానికి సుజిత్ మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ విషయం తెలుసుకున్న బంధువులు స్టేషన్‌కు చేరుకుని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు.

"ప్రయాణికులు ఫోన్ చేసిన వెంటనే అధికారులు స్పందించి వైద్యం అందించి ఉంటే సుజిత్ బతికేవాడు" అని వారు ఆరోపించారు. ఈ ఘటనపై జీఆర్‌పీ పోలీసులు కేసు నమోదు చేసి, దీనిని సహజ మరణంగా పరిగణిస్తున్నారు. గుండెపోటుతో మృతి చెందినట్లుగా భావిస్తున్నారు.

అనంతరం మృతదేహాన్ని బంధువులు స్వాధీనం చేసుకున్నారు. మృతుడి బంధువుల ఆందోళన కారణంగా గోదావరి ఎక్స్‌ప్రెస్ సుమారు 52 నిమిషాల పాటు కాజీపేట రైల్వే స్టేషన్‌లో నిలిచిపోయింది. 


More Telugu News