Kalvakuntla Kavitha: రాహుల్ జీ .. 2 లక్షల ఉద్యోగాలేవి?.. నిలదీసిన కవిత

Kalvakuntla Kavitha Questions Rahul Gandhi on 2 Lakh Jobs Promise
  • రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన వేళ కవిత ట్వీట్
  • 2 లక్షల ఉద్యోగాల హామీ ఏమైందని సూటి ప్రశ్న
  • హామీ ఇచ్చి రెండున్నరేళ్లు గడిచిందని విమర్శ
  • ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని డిమాండ్
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ఉద్దేశించి సోషల్ మీడియా వేదికగా పలు ప్రశ్నలు సంధించారు. డీసీసీ అధ్యక్షుల శిక్షణ కార్యక్రమం కోసం రాహుల్ గాంధీ తెలంగాణకు వస్తున్న సందర్భంగా, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎన్నికల హామీలను గుర్తుచేస్తూ ఆమె ట్వీట్ చేశారు. "రాహుల్ గాంధీ జీ.. దో లాక్ నౌకరీ దో" అంటూ విమర్శలు గుప్పించారు. 

కాంగ్రెస్‌ను గెలిపిస్తే ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పటికే రెండున్నరేళ్లు గడిచిపోయిందని కవిత విమర్శించారు. "మీ హామీని నమ్మి శిక్ష అనుభవిస్తున్న మా నిరుద్యోగుల గోడు మీకు పట్టదా?" అని ఆమె రాహుల్‌ను సూటిగా ప్రశ్నించారు. పార్టీని గద్దెనెక్కించడానికి నిచ్చెనమెట్లుగా నిలిచిన యువత ఆశలను కాంగ్రెస్ చిదిమేసిందని ఆరోపించారు. ఉద్యోగాలు అడిగితే పోలీసులతో అణచివేస్తున్నారని ఆమె మండిపడ్డారు. 

యూత్ డిక్లరేషన్ బోగస్‌గా మారిందని, జాబ్ క్యాలెండర్ అడ్రస్ లేకుండా పోయిందని కవిత విమర్శించారు. కాంగ్రెస్ అంటేనే మోసం, వంచన అనే మాటను నిలబెట్టుకుందని ఆమె వ్యాఖ్యానించారు. తెలంగాణ పోరాటాల పురిటిగడ్డ అని గుర్తుచేసిన కవిత, ఇచ్చిన హామీని నిలబెట్టుకుని 2 లక్షల ఉద్యోగాల భర్తీ ప్రక్రియను వెంటనే అమలు చేయించాలని రాహుల్ గాంధీని డిమాండ్ చేశారు.
Kalvakuntla Kavitha
Rahul Gandhi
Telangana Jagruthi
Congress Party
Telangana Elections
Job Creation
Employment Promises
Youth Declaration
Job Calendar
Telangana Politics

More Telugu News