షారుక్ ఖాన్, భార్య గౌరీఖాన్‌కు చెందిన రెడ్ చిల్లీస్‌కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు

  • నెట్‌ఫ్లిక్స్‌కు కూడా నోటీసులు జారీ చేసిన హైకోర్టు
  • ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్‌పై సమీర్ వాంఖడే పరువు నష్టం దావా
  • వారం రోజుల్లో సమాధానం చెప్పాలని హైకోర్టు నోటీసులు
బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్, రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్మెంట్, నెట్‌ఫ్లిక్స్‌తో పాటు పలువురికి ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. నెట్‌ఫ్లిక్స్ వెబ్ సిరీస్ 'ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్'పై నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో ముంబై జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే దాఖలు చేసిన పరువు నష్టం దావా కేసులో వారికి నోటీసులు జారీ అయ్యాయి.

రెడ్ చిల్లీస్ యజమాని గౌరీ ఖాన్ తన 55వ పుట్టినరోజు జరుపుకుంటున్న సమయంలో ఈ నోటీసులు రావడం గమనార్హం.

నెట్‌ఫ్లిక్స్, ఎక్స్, గూగుల్, మెటా ప్లాట్‌ఫారమ్‌లు, ఆర్పీఎస్‌జీ లైఫ్‌స్టైల్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, జాన్ డోలకు కూడా నోటీసులు జారీ అయ్యాయి. ప్రతివాదులు ఏడు రోజుల్లోగా సమాధానాలు చెప్పాలని హైకోర్టు ఆదేశించింది. పిటిషన్ కాపీలను తమకు అందించాలని వాంఖడేకు సూచించింది. అనంతరం కేసు తదుపరి విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది.

నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అయిన ఈ వెబ్ సిరీస్ తన ప్రతిష్ఠను దిగజార్చిందని వాంఖడే తన పిటిషన్‌లో పేర్కొన్నారు. రెడ్ చిల్లీస్, యజమానులు గౌరీ ఖాన్, షారుక్ ఖాన్‌ల నుంచి రూ. 2 కోట్ల నష్టపరిహారాన్ని వాంఖడే డిమాండ్ చేశారు. ఆ మొత్తాన్ని క్యాన్సర్ రోగుల చికిత్స నిమిత్తం టాటా మెమోరియల్ క్యాన్సర్ హాస్పిటల్‌కు విరాళంగా ఇవ్వాలని ఆయన తన పిటిషన్‌లో కోరారు.

వాంఖడే తరఫున సీనియర్ న్యాయవాది సందీప్ సేథి వాదనలు వినిపించారు. పరువు నష్టం దావా వేసినందుకు అధికారి కుటుంబాన్ని సామాజిక మాధ్యమాల్లో లక్ష్యంగా చేసుకుంటున్నారని కోర్టుకు తెలిపారు. తన భార్యను, సోదరిని ట్రోల్ చేస్తున్న పోస్టులు వివిధ మాధ్యమాల్లో ఉన్నాయని వాంఖడే తన పిటిషన్‌లో వెల్లడించారు.

వాదనల సందర్భంగా ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. బలమైన కారణాలు లేకుండా ఈ వెబ్ సిరీస్‌ను నిషేధించలేమని తెలిపింది. పిటిషన్ వేయడానికి ఒక కారణం ఉందని అంగీకరిస్తున్నామని, అయితే నిషేధించడానికి ఒక విధానం ఉంటుందని హైకోర్టు వ్యాఖ్యానించింది.

'ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్' వెబ్ సిరీస్ కు దర్శకత్వం వహించింది షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ అని తెలిసిందే.


More Telugu News