బీసీ రిజర్వేషన్ల అంశంపై వాడివేడిగా వాదనలు.. విచారణ రేపటికి వాయిదా వేసిన హైకోర్టు

  • రేపు మధ్యాహ్నం తదుపరి వాదనలు వింటామన్న హైకోర్టు
  • రిజర్వేషన్లు 50 శాతం దాటడం రాజ్యాంగ విరుద్ధమన్న పిటిషనర్
  • సమగ్ర అధ్యయనం తర్వాతే బిల్లు తీసుకువచ్చామన్న ప్రభుత్వం
తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల అంశంపై హైకోర్టులో విచారణ జరిగింది. తదుపరి విచారణను రేపు మధ్యాహ్నం 2.15 గంటలకు వాయిదా వేసింది. స్థానిక ఎన్నికలకు గురువారం నోటిఫికేషన్ జారీ చేస్తే స్టే ఇవ్వాలని పిటిషనర్ కోరారు. పిటిషనర్ విజ్ఞప్తిని న్యాయస్థానం పరిగణనలోకి తీసుకోలేదు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ జీవోను పలువురు హైకోర్టులో సవాల్ చేశారు. మరోవైపు, బీసీ రిజర్వేషన్లకు అనుకూలంగా ఆర్. కృష్ణయ్య, వి. హనుమంతరావుతో పాటు పలువురు బీసీ నాయకులు ఇంప్లీడ్ అయ్యారు. అన్ని పిటిషన్లను కలిపి సీజే జస్టిస్ ఏకే సింగ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది.

పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, రిజర్వేషన్లు 50 శాతం దాటడం రాజ్యంగ విరుద్ధమని అన్నారు. విద్య, ఉద్యోగాల్లో 50 శాతం దాటినా రాజకీయ రిజర్వేషన్లు పెంచరాదని అన్నారు. ఏజెన్సీల్లో ఎస్టీలకు మాత్రమే రిజర్వేషన్ సీలింగ్ వర్తించదని పేర్కొన్నారు. 42 శాతం రిజర్వేషన్లకు శాస్త్రీయ ఆధారాలు చూపలేదని, బీసీ కులగణన చేశారు కానీ బహిర్గతం చేయలేదని కోర్టుకు తెలిపారు.

ఎస్సీ, ఎస్టీ జనాభాను పరిగణనలోకి తీసుకోకుండా బీసీ రిజర్వేషన్లు ఎలా పెంచుతారని ప్రశ్నించారు. 2018లో 34 శాతం బీసీ రిజర్వేషన్లను ఇదే న్యాయస్థానం కొట్టివేసిందని గుర్తు చేశారు. రాజ్యాంగబద్ధ ఎన్నికల నిర్వహణకు తాము వ్యతిరేకం కాదని, రాజ్యాంగ విరుద్ధంగా నిర్వహిస్తే ఎలా అని ప్రశ్నించారు.

ప్రభుత్వం తరఫున అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. బీసీ రిజర్వేషన్ల బిల్లును అన్ని పార్టీలు ఏకగ్రీవంగా ఆమోదించాయని కోర్టుకు తెలిపారు. రాజకీయాలకతీతంగా మద్దతు లభించిన తర్వాత జీవోపై స్టే ఇవ్వాలని కోరడం సరికాదని అన్నారు. సమగ్ర కులగణన ద్వారానే ప్రభుత్వం ముందుకు వెళుతోందని అన్నారు. ప్రజా సంక్షేమం కోసం నిర్ణయాలు తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉందని, కానీ డెడికేటెడ్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రభుత్వం రిజర్వేషన్లను 50 శాతానికి మించి పెంచవచ్చని తెలిపారు.

శాసన వ్యవస్థ చేసిన చట్టాన్ని ఎవరూ ప్రశ్నించలేరని సింఘ్వీ అన్నారు. సవరణ చేసినా, చట్టం చేసినా శాసన వ్యవస్థదే నిర్ణయమని అన్నారు. చట్టసభలు చేసిన చట్టాలను కొంతమంది గవర్నర్లు త్రిశంకు స్వర్గంలో ఉంచుతున్నారని కోర్టుకు తెలిపారు. కానీ నెలల పాటు ఏ నిర్ణయమూ చెప్పడం లేదని, బిల్లును ఆమోదించడం లేదు లేదా తిరస్కరించడం లేదని తెలిపారు. బీసీ రిజర్వేషన్ బిల్లు విషయంలోనూ గవర్నర్ ఇలాగే వ్యవహరించారని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. వారి చర్యల వల్ల ప్రజల ఆకాంక్షలు నెరవేరడం లేదని అన్నారు.

ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ విడుదలైందని, ఈ ప్రక్రియలో కోర్టులు జోక్యం చేసుకోవద్దనే తీర్పులు ఉన్నాయని అన్నారు. ఈ సమయంలో స్టే ఇవ్వడం సరికాదని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. సమగ్ర అధ్యయనం తర్వాతే ఈ బిల్లును ప్రభుత్వం తీసుకువచ్చిందని, పూర్తి వాదనలు విన్న తర్వాత నిర్ణయం తీసుకోవాలని కోరారు. అనంతరం హైకోర్టు తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది.


More Telugu News