దగ్గు సిరప్ తో చిన్నారుల మృతి.. ఇతర దేశాలకు ఎగుమతిపై ఆరా తీసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ

  • కోల్డ్‌రిఫ్ దగ్గు మందును ఇతర దేశాలకు ఎగుమతి చేశారా అని డబ్ల్యుహెచ్‌ఓ అడిగిందని మీడియాలో కథనాలు
  • వివరణ ఇచ్చిన సంబంధిత అధికారులు
  • గ్లోబల్ మెడికల్ ప్రొడక్ట్స్ అలర్ట్ జారీ చేయాలా అని అడిగిన డబ్ల్యూహెచ్‌ఓ
దగ్గు మందు కారణంగా మధ్యప్రదేశ్‌లో దాదాపు 20 మంది చిన్నారులు మృతి చెందడం దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. తమిళనాడులోని కాంచీపురానికి చెందిన శ్రీసన్ ఫార్మా యూనిట్ తయారు చేసిన కోల్డ్‌రిఫ్ దగ్గుమందు ఈ చిన్నారుల మరణాలకు కారణమైంది. ఈ ఘటనపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) స్పందించింది. ఈ సిరప్‌ను ఇతర దేశాలకు ఎగుమతి చేశారా అని భారత్ నుంచి వివరాలు కోరింది.

ఈ మేరకు ఆంగ్ల మీడియాలో కథనాలు వెలువడ్డాయి. చిన్నారుల మరణాలకు కారణమైన కోల్డ్‌రిఫ్ దగ్గు మందును ఇతర దేశాలకు ఎగుమతి చేశారా అని ప్రపంచ ఆరోగ్య సంస్థ అడిగిందని, సంబంధిత అధికారుల నుంచి వివరణ వచ్చిన తర్వాత ఈ ఔషధంపై గ్లోబల్ మెడికల్ ప్రొడక్ట్స్ అలర్ట్ జారీ చేయాలా? వద్దా? అని అంశంపై అంచనా వేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ భారత్‌ను కోరిందని ఆ కథనాల్లో పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా, దగ్గు మందు కారణంగా మధ్యప్రదేశ్‌లో మరణాల సంఖ్య పెరుగుతోంది. మృతుల సంఖ్య ఈరోజు 20కి చేరింది. ఒక్క చింద్వాడలోనే 17 మంది ప్రాణాలు కోల్పోయారని మధ్యప్రదేశ్ ఆరోగ్య శాఖ మంత్రి రాజేంద్ర శుక్లా వెల్లడించారు. మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని ఆయన తెలిపారు.

కాంచీపురానికి చెందిన శ్రీసన్ ఫార్మా యూనిట్ ఈ మందును తయారు చేసిందని, కంపెనీలో తనిఖీలు చేయగా సిరప్‌లో 48.6 శాతం డైఇథైలిన్ గ్లైకాల్ ఉందని తేలిందని అధికారులు తెలిపారు. ఇది అత్యంత విషపూరితమైన రసాయనమని పేర్కొన్నారు. కంపెనీపై చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఈ సిరప్‌పై తెలంగాణతో సహా పలు రాష్ట్రాలు నిషేధం విధించాయి.


More Telugu News