Aman Sehrawat: ఒలింపిక్ మెడలిస్ట్ అమన్‌కు భారీ షాక్.. ఏడాది నిషేధం

Paris Olympics Bronze Medalist Aman Sehrawat Gets One Year Suspension Due To This Reason
  • పారిస్ ఒలింపిక్స్ పతక విజేత అమన్ సెహ్రావత్‌పై వేటు
  • ఏడాది పాటు అన్ని పోటీల నుంచి నిషేధించిన రెజ్లింగ్ సమాఖ్య
  • ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో అధిక బరువుతో అనర్హత
  • క్రమశిక్షణారాహిత్యమే కారణమన్న సమాఖ్య
  • అమన్ ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేదని వెల్లడి
పారిస్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత, యువ రెజ్లర్ అమన్ సెహ్రావత్‌కు భారత రెజ్లింగ్ సమాఖ్య (డ‌బ్ల్యూఎఫ్ఐ) భారీ షాక్ ఇచ్చింది. క్రమశిక్షణారాహిత్యం కింద అతనిపై ఏడాది పాటు నిషేధం విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. సీనియర్ ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో నిర్దేశిత బరువు కంటే ఎక్కువగా ఉండటంతో ఈ కఠిన చర్యలు తీసుకున్నట్లు వెల్లడైంది.

ఇటీవల క్రొయేషియాలో సెప్టెంబర్ 13 నుంచి 21 వరకు సీనియర్ ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్ జరిగింది. ఈ టోర్నీలో పతకంపై గట్టి ఆశలతో బరిలోకి దిగిన అమన్, పురుషుల 57 కేజీల ఫ్రీస్టైల్ విభాగంలో పోటీ పడాల్సి ఉంది. అయితే, పోటీలకు ముందు నిర్వహించే బరువు తూకంలో అతను విఫలమయ్యాడు. పరిమితికి మించి 1.7 కిలోలు ఎక్కువగా ఉండటంతో అధికారులు అతడిని పోటీల నుంచి అనర్హుడిగా ప్రకటించారు. ఈ టోర్నీలో భారత్ తరఫున అంతిమ్ పంఘల్ మాత్రమే మహిళల 53 కేజీల విభాగంలో కాంస్య పతకం సాధించింది.

ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన భారత రెజ్లింగ్ సమాఖ్య, సెప్టెంబర్ 23న అమన్‌కు షోకాజ్ నోటీసు జారీ చేసి వివరణ కోరింది. దీనిపై సెప్టెంబర్ 29న అమన్ తన స్పందనను సమర్పించాడు. అయితే, అతని వివరణ సంతృప్తికరంగా లేదని క్రమశిక్షణ కమిటీ తేల్చిచెప్పింది. ఒలింపిక్ పతక విజేతగా ఉండి కూడా వృత్తిపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై సమాఖ్య తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.

"జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అన్ని రకాల రెజ్లింగ్ కార్యకలాపాల నుంచి మిమ్మల్ని ఏడాది పాటు సస్పెండ్ చేస్తున్నాం. ఈ నిర్ణయమే అంతిమం" అని అమన్‌కు పంపిన లేఖలో రెజ్లింగ్ సమాఖ్య స్పష్టం చేసినట్లు ఈఎస్పీఎన్ తన కథనంలో పేర్కొంది. ఈ నిషేధ కాలంలో సమాఖ్య నిర్వహించే ఏ పోటీల్లోనూ పాల్గొనడానికి వీల్లేదని స్ప‌ష్టం చేసింది. 

ఈ వ్యవహారంలో అమన్‌తో పాటు అతని కోచింగ్ సిబ్బందిపై కూడా సమాఖ్య దృష్టి సారించింది. చీఫ్ కోచ్ జగ్‌మందర్ సింగ్‌తో పాటు మరో ముగ్గురు సహాయక సిబ్బందిని వివరణ కోరింది. ఛాంపియన్‌షిప్‌కు ముందు అథ్లెట్ బరువును పర్యవేక్షించడంలో ఎందుకు విఫలమయ్యారని వారిని ప్రశ్నించింది.
Aman Sehrawat
Aman Sehrawat ban
WFI
Indian wrestling federation
Wrestling ban
World wrestling championship
Antim Panghal
Jaghmander Singh
Paris Olympics

More Telugu News