Ponnam Prabhakar: అడ్లూరితో వివాదంపై పొన్నం ప్రభాకర్ స్పందన

Ponnam Prabhakar Responds to Controversy with Adluri Lakshman
  • రాజకీయాలకు మించిన అనుబంధం తమ మధ్య ఉందన్న మంత్రి
  • అడ్లూరి తనకు సోదరుడి వంటి వారని వ్యాఖ్య
  • అనుచిత వ్యాఖ్యలు చేయలేదని వివరణ
తెలంగాణ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ జరుగుతున్న వివాదంపై మంత్రి పొన్నం ప్రభాకర్ తాజాగా స్పందించారు. తాను ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదని వివరణ ఇచ్చారు. ఈ మేరకు బుధవారం ఉదయం ఓ వీడియోను విడుదల చేస్తూ.. అడ్లూరి లక్ష్మణ్ తనకు సోదరుడిలాంటి వారని, తమ మధ్య రాజకీయాలకు మించిన అనుబంధం ఉందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో 30 ఏళ్లుగా కొనసాగుతున్నామని గుర్తుచేశారు.

ఇద్దరమూ పరస్పర గౌరవించుకుంటామని, విడదీయరాని అనుబంధం ఉందని చెప్పుకొచ్చారు. అడ్లూరిపై ఎలాంటి వ్యక్తిగత వ్యాఖ్యలు చేయలేదని స్పష్టం చేశారు. రాజకీయ దురుద్దేశంతో కొందరు తన వ్యాఖ్యలను వక్రీకరించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. దీంతో అపార్థాలు పొడసూపాయని, అన్నలాంటి అడ్లూరి బాధపడ్డారని తెలిసి విచారం కలిగిందని చెప్పారు.

అసలు ఏంజరిగిందంటే..
జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో ఉప ఎన్నిక నేపథ్యంలో అభ్యర్థి ఎంపికకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఇటీవల ఓ సమావేశం నిర్వహించింది. ఇందులో మంత్రులతో పాటు సీనియర్ నేతలు పాల్గొన్నారు. ఈ సమావేశానికి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆలస్యంగా రావడంపై సహచర మంత్రి పొన్నం ప్రభాకర్ అసహనం వ్యక్తం చేశారని, అడ్లూరిని ఉద్దేశించి మరో మంత్రి వద్ద అనుచిత వ్యాఖ్యలు చేశారని ప్రచారం జరుగుతోంది. దీనిపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సోషల్ మీడియాలో ఓ వీడియో విడుదల చేయడంతో వివాదం ముదిరింది. దీనిపై తాజాగా మంత్రి పొన్నం ప్రభాకర్ విచారం వ్యక్తం చేస్తూ వీడియో రిలీజ్ చేశారు.
Ponnam Prabhakar
Adluri Lakshman
Telangana Politics
Jubilee Hills by-election
Congress Party Telangana
Political Controversy
Telangana Ministers
Internal Party Conflict
Telangana Congress
Political Misinformation

More Telugu News