జగన్ పర్యటనను అడ్డుకుంటాం: దళిత సంఘాలు

  • డాక్టర్ సుధాకర్ కుటుంబానికి జగన్ క్షమాపణ చెప్పాలని దళిత సంఘాల డిమాండ్
  • సుధాకర్ మరణానికి జగనే కారణమంటూ తీవ్ర ఆరోపణలు
  • మాస్క్ అడిగిన పాపానికి వైద్యుడిని బలిగొన్నారని విమర్శ
వైసీపీ అధినేత జగన్‌కు నర్సీపట్నంలో నిరసన సెగ తగలనుంది. ఆయన తలపెట్టిన పర్యటనను అడ్డుకుని తీరుతామని పలు దళిత సంఘాలు తీవ్రంగా హెచ్చరించాయి. నర్సీపట్నంలో అడుగుపెట్టే ముందు, దివంగత వైద్యుడు డాక్టర్ సుధాకర్ కుటుంబానికి జగన్ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు.

డాక్టర్ సుధాకర్ మరణానికి జగన్ ప్రభుత్వమే కారణమని దళిత సంఘాల నేతలు ఆరోపించారు. కేవలం ఒక మాస్క్, పీపీఈ కిట్ అడిగినందుకే ఒక వైద్యుడిని బలి తీసుకున్నారని, ఈ నిజం ప్రపంచమంతటికీ తెలుసని వారు వ్యాఖ్యానించారు. ఒక డాక్టర్ ప్రాణాలకే రక్షణ కల్పించలేని వారు, ఇప్పుడు నర్సీపట్నంలో మెడికల్ కాలేజీ నిర్మిస్తామంటే ప్రజలు ఎలా నమ్ముతారని వారు ప్రశ్నించారు.

డాక్టర్ సుధాకర్‌కు జరిగిన అన్యాయంపై, ఆయన మృతిపై ఇప్పటికీ న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై తక్షణమే సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లను అంగీకరించి, సుధాకర్ కుటుంబానికి క్షమాపణ చెప్పని పక్షంలో, జగన్ పర్యటనను దళిత సంఘాల ఆధ్వర్యంలో కచ్చితంగా అడ్డుకుంటామని వారు స్పష్టం చేశారు. 


More Telugu News