Viral Video: విడాకులే ఓ పండగ.. యువకుడి వింత వేడుక చూసి అవాక్కవుతున్న నెటిజన్లు!

Man celebrates divorce with milk bath and Happy Divorced cake shares video
  • విడాకులను పండగలా జరుపుకున్న ఓ యువకుడు
  • తల్లితో క్షీరాభిషేకం చేయించుకున్న వైనం
  • 'హ్యాపీ డివోర్స్' అని రాసి ఉన్న కేక్ కటింగ్
  • ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో పోస్ట్ చేయడంతో వైరల్
  • యువకుడి చర్యపై నెటిజన్ల మిశ్రమ స్పందనలు
సాధారణంగా విడాకులు అనేవి ఎంతో బాధాకరమైన విషయం. కానీ, ఓ వ్యక్తి మాత్రం తన విడాకులను ఒక పండగలా జరుపుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు. భార్య నుంచి విడాకులు మంజూరు కావడంతో ఏకంగా కుటుంబ సభ్యుల మధ్య కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

వివరాల్లోకి వెళితే... బీరాదర్ డీకే అనే వ్యక్తికి ఇటీవల తన భార్య నుంచి చట్టపరంగా విడాకులు లభించాయి. ఈ ఆనందాన్ని పంచుకోవడానికి అతను వినూత్నంగా వేడుకలు జరుపుకున్నాడు. పండగ వాతావరణంలో, బంధుమిత్రుల హర్షధ్వానాల నడుమ తన తల్లితో పాలతో అభిషేకం చేయించుకున్నాడు. అనంతరం 'హ్యాపీ డివోర్స్' అని రాసి ఉన్న కేక్‌ను కట్ చేసి తన కొత్త జీవితానికి స్వాగతం పలికాడు.

ఈ వేడుకకు సంబంధించిన వీడియోను బీరాదర్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పంచుకున్నాడు. "దయచేసి సంతోషంగా ఉండండి. మిమ్మల్ని మీరు గౌరవించుకోండి. కుంగిపోవద్దు. 120 గ్రాముల బంగారం, 18 లక్షల నగదు నేను తీసుకోలేదు, ఇచ్చాను. ఇప్పుడు ఒంటరిగా, సంతోషంగా, స్వేచ్ఛగా ఉన్నాను. నా జీవితం, నా నిబంధనలు" అంటూ ఒక క్యాప్షన్ కూడా జోడించాడు. 

ఈ వీడియోపై నెటిజన్ల నుంచి మిశ్ర‌మ‌ స్పందనలు వ‌స్తున్నాయి. కొందరు విడాకుల తర్వాత కూడా ఇంత సానుకూలంగా, ధైర్యంగా ఉన్నందుకు అతడిని ప్రశంసించారు. మరికొందరు మాత్రం విడాకుల వంటి సున్నితమైన విషయాన్ని ఇలా బహిరంగంగా వేడుకలా జరుపుకోవడం సరికాదని విమర్శించారు. కాగా, గతంలోనూ విడాకుల కేసులో భరణం చెల్లించకుండా గెలిచినందుకు ఓ వ్యక్తి స్నేహితులు వేడుకలు జరుపుకున్న ఘటన కూడా ఇలాగే చర్చకు దారితీసిన విషయం తెలిసిందే.
Viral Video
Beeradar DK
divorce celebration
happy divorce
social media
divorce party
marriage breakup
family celebration
freedom
personal life

More Telugu News