Vijay: బాధిత కుటుంబాలను కలవాలనుకుంటున్నా... అనుమతి ఇవ్వండి: విజయ్

Vijay Seeks Permission to Meet Karur Stampede Victims Families
  • కరూర్ తొక్కిసలాట బాధితులను కలవాలనుకుంటున్న హీరో విజయ్
  • అనుమతి కోరుతూ తమిళనాడు డీజీపీకి ఈ-మెయిల్ ద్వారా విజ్ఞప్తి
  • ఇప్పటికే వాట్సాప్ వీడియో కాల్ ద్వారా కుటుంబాలకు పరామర్శ
కరూర్ తొక్కిసలాట బాధితులను వ్యక్తిగతంగా కలిసి పరామర్శించేందుకు అనుమతి ఇవ్వాలని తమిళ హీరో, తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత విజయ్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఆయన తమిళనాడు డీజీపీకి ఈ-మెయిల్ ద్వారా ఒక విజ్ఞప్తి పంపారు. బాధితులతో నేరుగా మాట్లాడి, వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేయాలని భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

ఇప్పటికే విజయ్ వాట్సాప్ వీడియో కాల్స్ ద్వారా బాధిత కుటుంబాలతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పిన విషయం తెలిసిందే. అయితే, ఇప్పుడు వారిని స్వయంగా కలవాలని ఆయన నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలోనే పోలీసుల అనుమతి కోసం అధికారికంగా ప్రయత్నాలు ప్రారంభించారు.

అయితే, విజయ్ విజ్ఞప్తికి పోలీసుల నుంచి అనుమతి లభిస్తుందా? లేదా? అన్న దానిపై సర్వత్ర ఆసక్తి నెలకొంది. కరూర్ సభలో తొక్కిసలాట జరగడానికి విజయ్ ఆలస్యంగా రావడమే ప్రధాన కారణమని పోలీసులు ఇప్పటికే ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో, ఆయన పర్యటనకు అధికారులు అంగీకరించకపోవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

మరోవైపు, ఈ దుర్ఘటనపై విజయ్, స్టాలిన్ ప్రభుత్వం మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయిలో కొనసాగుతోంది. ప్రభుత్వ వైఫల్యం, సరైన భద్రతా ఏర్పాట్లు చేయకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని విజయ్ ఆరోపిస్తుండగా... విజయ్ నిర్లక్ష్యమే ప్రజల ప్రాణాలు తీసిందని ప్రభుత్వం ఎదురుదాడి చేస్తోంది. కాగా, కరూర్‌లో జరిగిన ఈ విషాద ఘటనలో 41 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 61 మంది తీవ్రంగా గాయపడ్డారు.
Vijay
Tamil Nadu
Karur Stampede
Tamilaga Vettri Kazhagam
TVK
MK Stalin
Tamil Nadu DGP
Politics
Public Safety
Accident Investigation

More Telugu News