Prashant Kishor: చిరాగ్ పాశ్వాన్‌తో పొత్తు వార్తలపై ప్రశాంత్ కిశోర్ క్లారిటీ

Prashant Kishor Clarifies Alliance Rumors with Chirag Paswan
  • చిరాగ్ పాశ్వాన్ పార్టీతో పొత్తు వార్తలను ఖండించిన పీకే
  • ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని స్పష్టీకరణ
  • తమ పొత్తు ప్రజలతోనే అన్న పీకే
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తన జన్ సురాజ్ పార్టీ ఎవరితోనూ పొత్తు పెట్టుకోదని ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ (పీకే) స్పష్టం చేశారు. చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్)తో జతకడతారంటూ వస్తున్న ఊహాగానాలకు ఆయన తెరదించారు. తమ కూటమి కేవలం ప్రజలతోనే ఉంటుందని ఆయన తేల్చిచెప్పారు.

పొత్తుల ప్రచారంపై స్పందిస్తూ, "బీహార్‌ను దోచుకోవడానికే ఇక్కడ పోరాటం జరుగుతోంది, ఇది సీట్ల కోసం జరుగుతున్న యుద్ధం కాదు. భవిష్యత్తులో రాష్ట్రాన్ని మరింతగా దోచుకోవడానికే ప్రతి పార్టీ ఎక్కువ సీట్లు కోరుకుంటోంది. మాకు ఎవరితోనూ పొత్తు లేదు. మా పొత్తు కేవలం ప్రజలతోనే" అని ఆయన అన్నారు.

ప్రస్తుతం ఎన్డీఏ కూటమిలో సీట్ల పంపకాలపై తీవ్ర చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ప్రశాంత్ కిశోర్, చిరాగ్ పాశ్వాన్ మధ్య పొత్తు కుదరవచ్చనే ప్రచారం జరిగుతోంది. కేంద్ర ఆహార శుద్ధి పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న చిరాగ్ పాశ్వాన్, మొత్తం 243 అసెంబ్లీ స్థానాల్లో తమ పార్టీకి 40 సీట్లు కేటాయించాలని పట్టుబడుతున్నట్లు సమాచారం. గత లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన ఐదు స్థానాల్లోనూ గెలిచినందున, ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో తమకు అంతే స్థాయిలో ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.

అయితే, బీజేపీ కేవలం 25 సీట్లు ఇచ్చేందుకే సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రతిపాదనకు పాశ్వాన్ అంగీకరించడం లేదని సమాచారం. ఈ క్రమంలోనే ఆయన పరోక్షంగా హెచ్చరికలు కూడా జారీ చేశారు. "నేను కూరలో ఉప్పు లాంటి వాడిని. ప్రతి నియోజకవర్గంలో 20,000 నుంచి 25,000 ఓట్లను ప్రభావితం చేయగలను. కూటమి నుంచి బయటకు వచ్చే అవకాశం నాకు ఎప్పుడూ ఉంటుంది" అని ఆయన ఓ సందర్భంలో వ్యాఖ్యానించారు.

అయితే, చిరాగ్ పాశ్వాన్ వ్యాఖ్యలను బీజేపీ పెద్దగా పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. ఆయన ప్రధాని మోదీకి నమ్మకమైన మద్దతుదారుడని, పార్టీలోని కొందరు అసమ్మతి నేతలను శాంతింపజేయడానికే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని బీజేపీ వర్గాలు భావిస్తున్నట్లు సమాచారం. 
Prashant Kishor
Chirag Paswan
Bihar Assembly Elections
Jan Suraj Party
Lok Janshakti Party
NDA alliance
Bihar politics
Seat sharing
Political alliance
Indian elections

More Telugu News