తెలంగాణ ఆర్టీసీలో నేటి నుంచి ఉద్యోగ నియామకాలకు దరఖాస్తులు

  • టీజీఎస్ఆర్‌టీసీలో డ్రైవర్, శ్రామిక్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
  • నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం 
  • కొత్త కుల ధ్రువీకరణ పత్రం తప్పనిసరి
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) నిరుద్యోగ యువతకు శుభవార్తను అందించింది. సంస్థలో డ్రైవర్, శ్రామిక్ పోస్టుల భర్తీకి సిద్ధమైంది. ఈ మేరకు మొత్తం 1,743 పోస్టులను భర్తీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఇందులో డ్రైవర్ ఉద్యోగాలు 1,000, శ్రామిక్ పోస్టులు 743 ఉన్నాయి.

దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ అక్టోబర్ 8వ తేదీ నుంచి 28వ తేదీ వరకు జరుగుతుంది. ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు www.tgprb.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. గతంలో ఆర్టీసీ స్వయంగా ఉద్యోగాలను భర్తీ చేసేది. అయితే ఈసారి పోస్టుల భర్తీ బాధ్యతను తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (టీఎస్ఎల్‌పీఆర్‌బీ)కు అప్పగించారు.

వయోపరిమితి వివరాలు:
డ్రైవర్ పోస్టులకు: 22 – 35 సంవత్సరాలు
శ్రామిక్ పోస్టులకు: 18 – 30 సంవత్సరాలు

వయోపరిమితి సడలింపు:
ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు
ఎక్స్-సర్వీస్‌మెన్‌కు 3 సంవత్సరాలు

ఎస్సీ అభ్యర్థులకు కొత్త నిబంధనలు:
ఎస్సీ అభ్యర్థులు తమ కుల ధ్రువీకరణ పత్రాన్ని గ్రేడ్ 1, 2, 3 వర్గీకరణతో కూడిన కొత్త ఫార్మాట్‌లో తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుందని టీఎస్ఎల్‌పీఆర్‌బీ ఛైర్మన్ వీవీ శ్రీనివాసరావు స్పష్టం చేశారు.

కొత్త ఫార్మాట్‌లో సర్టిఫికెట్ ఇప్పుడే అందుబాటులో లేకపోతే, తాత్కాలికంగా పాత ధ్రువీకరణ పత్రాన్ని అప్‌లోడ్ చేయవచ్చని, అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ సమయంలో మాత్రం కొత్త ఫార్మాట్ తప్పనిసరిగా ఉండాలని తెలిపారు. మరింత సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్‌ www.tgprb.inను సందర్శించాలని సూచించారు. 


More Telugu News