ఆ మంత్రి నాపై చేసిన వ్యాఖ్యలకు స్పందించను!: మంత్రి పొన్నం ప్రభాకర్

  • పొన్నం మాదిరిగా తాను అహంకారంగా మాట్లాడనన్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్
  • అడ్లూరి వ్యాఖ్యలపై స్పందించబోనన్న పొన్నం ప్రభాకర్
  • పార్టీ పరంగా మహేశ్ కుమార్ గౌడ్ ఇచ్చిన ఆదేశాలు పాటిస్తానని స్పష్టీకరణ
మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తనను అహంకారిగా అభివర్ణిస్తూ చేసిన వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ తనతో మాట్లాడారని, ఆయనతో జరిగిన సంభాషణే ఫైనల్ అని పొన్నం తెలిపారు.

రహ్మత్ నగర్ సమావేశంలో చోటుచేసుకున్న విషయాలను పీసీసీ అధ్యక్షుడికి వివరించినట్లు ఆయన పేర్కొన్నారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలపై తాను స్పందించబోనని ఆయన స్పష్టం చేశారు. పార్టీ పరంగా మహేశ్ కుమార్ గౌడ్ ఇచ్చిన ఆదేశాలను తప్పకుండా పాటిస్తానని ఆయన అన్నారు.

ఇటీవల మంత్రి పొన్నం ప్రభాకర్‌తో విభేదాల గురించి ప్రశ్నించగా అడ్లూరి లక్ష్మణ్ తీవ్రంగా స్పందించారు. పొన్నం మాదిరిగా అహంకారపూరితంగా మాట్లాడటం తనకు రాదని ఆయన అన్నారు. పొన్నం తన వైఖరిని మార్చుకోకపోతే జరిగే పరిణామాలకు ఆయన బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. త్వరలోనే పార్టీ పెద్దలను కలుస్తానని కూడా ఆయన తెలిపారు.

పొన్నంపై అడ్లూరి లక్ష్మణ్ బహిరంగంగా విమర్శలు చేయడంతో పీసీసీ చీఫ్ స్పందించారు. అడ్లూరి లక్ష్మణ్‌కు ఫోన్ చేసి ఇరువురు సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు. ఈ పరిణామాల నేపథ్యంలో అడ్లూరి లక్ష్మణ్ తనపై చేసిన వ్యాఖ్యల మీద స్పందించేందుకు పొన్నం ప్రభాకర్ నిరాకరించారు.


More Telugu News