ఇక ఆషికా రంగనాథ్ ను ఆపడం కష్టమే!
- 'అమిగోస్'తో ఎంట్రీ ఇచ్చిన ఆషిక
- 'నా సామిరంగ'తో తగిలిన పెద్ద హిట్
- చేతిలో 3 భారీ సినిమాలు
- ఇక బిజీ కావడం ఖాయమంటున్న ఫ్యాన్స్
వెండితెరపై వెలుగు రేఖలా తళుక్కున మెరిసే కథానాయికలు కొందరైతే, వెన్నెల ధారలా తెరపై నుంచి జారిపోయి ప్రేక్షకుల గుండె గదుల్లోకి చేరిపోయే కథానాయికలు మరికొందరు. అందం .. ఆకర్షణతో పాటు నాజూకుతనంతో ఆకట్టుకునే అలాంటి కథానాయికల జాబితాలో ఆషికా రంగనాథ్ ఒకరుగా కనిపిస్తారు. ఆషికా అంటే ఆకాశం నుంచి జారిపోయిన అందాల చందమామ అనే విషయం ఆడియన్స్ కి తొలి సినిమాతోనే అర్థమైపోయింది. 'అమిగోస్' సినిమాతో తెలుగు తెరకి పరిచయమైన ఈ తమలపాకు లాంటి అమ్మాయి, ఆ తరువాత 'నా సామిరంగ' సినిమాతో భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాకి ఆమె గ్లామర్ ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచింది. దాంతో ఆ సినిమాకి వెళ్లిన వాళ్లంతా థియేటర్లలో తమ మనసులు పారేసుకునే బయటికి వచ్చారు. ఇక ఈ సుందరి ఇక్కడ వరుసబెట్టి సినిమాలు చేయడం ఖాయమని అనుకున్నారు .. కానీ అలా జరగలేదు. ఆషికా ఆచితూచి కథలను ఎంచుకోవడమే ఇందుకు కారణమని అనుకోవాలి. ప్రస్తుతం ఆమె తెలుగులో 'విశ్వంభర' .. తమిళంలో 'సర్దార్ 2' .. కన్నడలో 'గత వైభవ' సినిమాలతో బిజీగా ఉంది. ఈ కన్నడ సినిమా వచ్చేనెల 14వ తేదీన థియేటర్లకు రానుంది. ఇక 'సర్దార్ 2'.. 'విశ్వంభర' కూడా భారీ అంచనాలు ఉన్న ప్రాజెక్టులే. ఈ సినిమాలు హిట్ కొడితే ఇక ఆషికను ఆపడం కష్టమేననే టాక్ బలంగా వినిపిస్తోంది. సీనియర్ స్టార్ హీరోల సరసన ఆమె బిజీగా కావడం ఖాయమేనని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.