ఫిలింనగర్‌లో భారీ చోరీ.. తాళం వేసిన ఇంట్లో రూ.లక్ష నగదు, 43 తులాల బంగారం అపహరణ!

   
నగరంలోని అత్యంత రద్దీ ప్రాంతాల్లో ఒకటైన ఫిలింనగర్‌లో భారీ దొంగతనం జరిగింది. తాళం వేసి ఉన్న ఓ ఇంట్లోకి చొరబడిన దొంగలు, సుమారు 43 తులాల బంగారం, లక్ష రూపాయల నగదును దోచుకెళ్లారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, ఫిల్మ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓయూ కాలనీలో నివసిస్తున్న స్వప్న అనే మహిళ ఇంట్లో ఈ చోరీ జరిగింది. ఇటీవల ఆమె భర్త మరణించడంతో, గత నెల 27న ఆమె తన అత్తవారింటికి వెళ్లారు. దాదాపు వారం రోజుల తర్వాత, ఈ నెల 5న తిరిగి ఇంటికి చేరుకున్నారు. ఇంటి తలుపులు తెరిచి లోపలికి వెళ్లి చూడగా, వస్తువులు చిందరవందరగా పడి ఉండటం, బీరువా తెరిచి ఉండటం గమనించారు.

వెంటనే అనుమానంతో బీరువాను పరిశీలించగా, అందులో దాచిన 43 తులాల బంగారు ఆభరణాలు, లక్ష రూపాయల నగదు కనిపించలేదు. దీంతో వెంటనే ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. క్లూస్ టీమ్‌తో ఘటనా స్థలాన్ని పరిశీలించి, ఆధారాలు సేకరించారు. ఇల్లు వారం రోజులకు పైగా మూసి ఉండటాన్ని గమనించిన దొంగలు, ఈ దోపిడీకి పాల్పడి ఉంటారని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ఘటనపై విచారణ కొనసాగుతోంది.


More Telugu News