స్వదేశంలో పరువు కోసం పాక్ ఆర్మీ పాకులాట.. పదే పదే తప్పుడు ప్రచారం

  • భారత్ తో ఘర్షణలో చైనా ఆయుధాలు అద్భుతంగా పనిచేశాయన్న ఐఎస్‌పీఆర్‌ డైరెక్టర్‌ జనరల్‌
  • భారత యుద్ధ విమానాలు ఏడింటిని కూల్చేశామని ప్రగల్భాలు
  • చైనా తయారీ జేఎఫ్‌-17 సహా 12 పాక్ విమానాలను కూల్చేశామని భారత వాయుసేనాధిపతి
భారత ఆర్మీ ఇటీవల చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ లో చావుదెబ్బ తిన్న పాకిస్థాన్ ఇప్పటికీ ప్రగల్భాలు పలకడం మానుకోలేదు. సొంత పౌరుల ముందు పరువు కోసం పాక్ ఆర్మీ పాకులాడుతోంది. ఆపరేషన్ సిందూర్ లో భారత వాయుసేన నిప్పుల వర్షం కురిపించగా.. పాక్ కు చెందిన యుద్ధ విమానాలు కాలి బూడిదయ్యాయి. ఈ యుద్ధ విమానాలను చైనా నుంచి పాక్ కొనుగోలు చేసింది. ఈ విషయం బయటపడితే పౌరుల ఆగ్రహం చవిచూడాల్సి వస్తుందనే భయంతో పాక్ ఆర్మీ ప్రగల్భాలు పలుకుతోంది.

తాజాగా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాక్ ఐఎస్‌పీఆర్‌ డైరెక్టర్‌ జనరల్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ అహ్మద్‌ షరీఫ్‌ చౌదరీ మరో కొత్త వాదనను తెరపైకి తీసుకొచ్చారు. భారత్‌తో జరిగిన ఘర్షణలో తాము ఉపయోగించిన చైనా ఆయుధాలు బాగా పనిచేశాయని చెప్పారు. భారత యుద్ధ విమానాలు ఏడింటిని కూల్చేశామంటూ తప్పుడు ప్రకటనలు చేశారు. ఈ ఘర్షణలో పాక్ ఒక్క యుద్ధ విమానాన్ని కూడా కోల్పోలేదని, చైనా యుద్ధ విమానాలు సమర్థంగా దాడులు చేశాయని చెప్పారు. 

భారత వాయుసేనాధిపతి ఏమన్నారంటే..
భారత వాయుసేనాధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ ఎ.పి.సింగ్‌ ఇటీవల ఓ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. భారత యుద్ధ విమానాలను కూల్చేశామంటూ పాక్‌ చేస్తున్న వాదనలు కట్టుకథలుగా కొట్టిపారేశారు. చైనా నుంచి పాకిస్థాన్ కొనుగోలు చేసిన జేఎఫ్‌-17 యుద్ధ విమానాలు మన ఫైటర్ జెట్ల ముందు నిలవలేకపోయాయని చెప్పారు. పాక్ సైన్యం ఉపయోగించిన అమెరికా తయారీ ఎఫ్ – 16 యుద్ధ విమానాన్నీ కూల్చేశామని చెప్పారు. ఆపరేషన్ సిందూర్ లో 12 పాక్ యుద్ధ విమానాలను నేల కూల్చామని వివరించారు.


More Telugu News